ముర్షీదాబాద్ మృతులకు 10 లక్షల నష్ట పరిహారం : మమతా బెనర్జీ
కోల్‌కతా : కేంద్రం ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 11న పశ్చిమబెంగాల్ ముర్షీదాబాద్‌లో నిరసనలు జరిగాయి. ఈ నిరసనల్లో ముగ్గురు మృతి చెందారు. తాజాగా మృతి చెందిన వారికి బెంగాల్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించింది. అలాగే ఈ ఘర్షణల వల్ల ఇళ్లు, దుకాణాలు ధ్వంసం అయితే వాటిని బంగ్లార్ బరి (హౌస్ స్కీమ్) కింద వాటిని రిపేర్ చేయిస్తామని బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వెల్లడించారు. నష్టపోయిన ఇళ్లు, దుకాణాలకు సంబంధించిన అంచనాను ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పరిశీలిస్తారని.. వాటిని త్వరలోనే రిపేర్ చేయిస్తామని మమతా ప్రకటించారు.
కాగా, నేడు కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ముర్షీదాబాద్ మృతులకు నష్టపరిహారిన్ని ప్రటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నేను కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాను. వక్ఫ్ సవరణ గురించి మీరెందుకు అంత తొందరపడ్డారు? బంగ్లాదేశ్ పరిస్థితి మీకు తెలియదా? బెంగాల్.. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్‌లతో సరిహద్దును పంచుకుంటుంది. దానివల్ల దేశానికి మంచి జరిగితే నేను సంతోషిస్తాను. కానీ వారి ప్రణాళిక ఏంటి? అక్కడి నుంచి ప్రజల తరలింపును సులభతరం చేసే కొన్ని ఏజెన్సీలను ఉపయోగించి అల్లర్లకు పాల్పడటమా? తాజాగా జరిగిన అల్లర్లలో బంగ్లాదేశ్‌కు ప్రమేయం ఉందని హోం మంత్రిత్వశాఖ వర్గాలను ఉటంకిస్తూ నిన్న నేను ఒక ట్వీట్ చేశాను. అదే జరిగితే, కేంద్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. ఎందుకంటే సరిహద్దుల్ని కాపాడేది బిఎస్‌ఎఫ్‌నే. మేము కాదు’ అని ఆమె అన్నారు.
మేము సర్వధర్మ సమభావాన్ని విశ్వసిస్తాము. నేను రామకృష్ణ పరమహంసను, స్వామి వివేకానందను నమ్ముతాను. బిజెపి ప్రకటనతో ఆందోళన చెంది బెంగాల్‌లో అశాంతి సృష్టించాలనుకుంటే.. దానిని నియంత్రించమని నేను కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అని మమతా అన్నారు.