మహారాష్ట్రలోని థానే వెస్ట్ ప్రాంతంలో సైఫ్ అలీఖాన్ కత్తితో దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విజయ్ దాస్ అనే వ్యక్తిని ముంబై పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు.
థానే వెస్ట్‌లోని హీరానందానీ ఎస్టేట్‌లోని మెట్రో నిర్మాణ ప్రాంతానికి సమీపంలోని లేబర్ క్యాంపు వద్ద డీసీపీ జోన్-6 నవనాథ్ ధవలే బృందం మరియు కాసర్వాడవలి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. దోపిడీ ఉద్దేశంతో గురువారం తెల్లవారుజామున తన బాంద్రా నివాసంలోకి చొరబడిన చొరబాటుదారుడితో పోరాడుతున్నప్పుడు సైఫ్ ఆరు కత్తిపోట్లకు గురయ్యాడు. దాడి చేసిన వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు, అనంతరం సైఫ్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.
ప్రధాన నిందితుడు విజయ్ దాస్ గతంలో ముంబైలోని ఓ పబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్న విజయ్ దాస్ ను రిమాండ్ కోసం పోలీసులు ఆదివారం తర్వాత కోర్టు ముందు హాజరుపరుస్తారని ముంబై క్రైమ్ బ్రాంచ్ తెలిపింది.