Mangal Munda : బిర్సా ముండా మునిమనవడు మృతి

రాంచీ: జార్ఖండ్‌లో ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండా మునిమనవడు మంగళ్‌ ముండా గురువారం రాత్రి మరణించారు. ఈ నెల 25న కుంతి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన..రాంచీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం 12:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కాగా ఈ 27న ఆసుపత్రిలో మంగళ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అత్యుత్తమ వైద్యం అందించాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. మంగళ్‌ ముండా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, గవర్నర్‌ సంతోష్‌ గంగ్వార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలను ముండా పూర్వీకుల గ్రామం ఉలిహటు వద్ద నిర్వహించే అవకాశ ఉంది. కాగా, 1875లో జన్మించిన బిర్సా ముండా బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా గిరిజనులను సమీకరించి పోరాటం కొనసాగించారు. అయితే 25 ఏళ్ల వయస్సులోనే బ్రిటిష్‌ అధికారుల కస్టడీలో మరణించారు. ఆ పోరాట యోధుని మునిమనువడు మంగళ్‌ మరణించడం ఆదివాసీలకు తీరని లోటు అని పలువురు పేర్కొన్నారు.

➡️