ఆరని మణిపూర్‌ మంటలు

Sep 9,2024 00:06 #6 death, #Manipur, #Violence
  • 400 రోజుల్లో మృతులు 230కి పైనే
  • 67 వేల మందికి పైగా నిరాశ్రయులు

ఇంఫాల్‌ : నాలుగు వందల రోజులైనా మణిపూర్‌లో హింసాగ్ని ఇంకా రగులుతూనే ఉంది. గత ఏడాది మే 3న ప్రారంభమైన హింసాకాండకు ఇంతవరకు 230 మందికి పైగా బలయ్యారు. 67 వేల మంది సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకూ కుకీలపై జరిగిన హింసాత్మక దాడుల్లో తొమ్మిది మంది చనిపోయారు .
మెయితీ కమ్యూనిటీకి ఎస్‌టి హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ 2023 మే 3న ఆల్‌ ట్రైబల్‌ స్టూడెండ్‌ యూనియన్‌ మణిపూర్‌ (ఎటిఎస్‌యుఎం) పిలుపుమేరకు ఇంఫాల్‌లో గిరిజనులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. దీనికి పోటీగా మెయితీకి చెందిన కొన్ని సంస్థలు మరొక ర్యాలీని నిర్వహించాయి. ఈ సందర్భంగా కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. కొంతమంది దుండగులు ఆంగ్లో – కుకి యుద్ధ శతాబ్ది ద్వారాన్ని దగ్ధం చేయడంతో పరిస్థితి దిగజారింది. ఆ తరువాత రోజుల్లో… ఇళ్లతో పాటు చర్చిలు, ఆలయాలు, వాహనాలను తగులబెట్టారు. మే 8 నాటికే 60 మంది దాకా మరణించారని, 231 మంది గాయపడ్డారని, మతపరమైన ప్రదేశాలతోపాటు 1,700 ఇళ్లు ధ్వంసమయ్యాయని ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌సింగ్‌ తెలిపారు. హింసాకాండ కారణంగా వేలాది మంది పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. మే 5 నాటికి 20 వేల మంది, మే 14 నాటికి 40 వేల మంది ఇళ్లను ఖాళీ చేసి 178 శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. హింసాకాండ దరిమిలా ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది.
కేంద్ర బలగాలను, సైన్యాన్ని రాష్ట్రంలో మోహరించారు. అయినా హింసాకాండ రోజురోజుకూ తీవ్రతరమవుతూనే ఉంది. జూన్‌ 14న రాష్ట్ర క్యాబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి నెమ్చా కిప్‌జెన్‌ అధికార నివాసంపై దాడి చేసి నివాసాన్ని తగులబెట్టారు. ఇతర ప్రాంతాల్లోనూ దాడులు పెరిగాయి. ఈ దాడుల్లో అధునాతన ఆయుధాలు వినియోగించడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. గత ఏడాది మే 4 నుంచి 29 మధ్య పోలీసుల నుంచి సుమారు మూడు వేల ఆయుధాలను ఆందోళనకారులు దోచుకున్నారు. వీటితోపాటు అనేక అధునిక ఆయుధాలను కూడా ఆందోళనకారులు బహిరంగంగా ప్రదర్శించడం, సోషల్‌ మీడియాలో పోస్టులు చేయడంతో దేశం నివ్వెరపోయింది. కొంతమంది వ్యక్తులు వీధుల్లో ఆయుధాలు, యూనిఫారాలతో కవాతు చేయడం, ఇళ్లపై దాడులు చేస్తున్న వీడియోలు దేశాన్ని కుదిపేశాయి. కొన్ని ఇళ్లపైనే కాకుండా కాలనీలు, ఊర్లకు ఊర్లను తగులబెట్టడం మణిపూర్‌లో సామాన్య విషయంగా మారిపోయింది. కుకీలు అధికంగా నివసించే ప్రాంతాలు అధికంగా దాడులకు గురయ్యాయి. ఇద్దరు మహిళలను నడి రోడ్డుపై నగంగా నడిపించిన దృశ్యాలు దేశానికే తలవంపులు తెచ్చాయి. బీహార్‌, హర్యానా, నాగాలాండ్‌ నుంచి వచ్చిన వలస కార్మికుల ఇళ్లపైనా దాడులు జరిగాయి. మణిపూర్‌లో ఇంత పెద్దయెత్తున హింసాకాండ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. బాధితులను పరామర్శించేందుకు ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్రమోడీ ఆ ప్రాంతాన్ని పర్యటించలేదు. పార్లమెంటులోనూ నోరు విప్పలేదు.

గవర్నరును కలిసిన సిఎం
హింసాకాండ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్‌. బీరెన్‌సింగ్‌.. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అనంతరం, రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. గవర్నర్‌ లక్ష్మణ్‌ ఆచార్యను కలిసి ఏకాంతంగా మాట్లాడారు.

ఆరుగురు మృతి
జిరిబామ్‌ జిల్లాలో తాజాగా చెలరేగిన హింసాకాండలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం ఓ వ్యక్తిని నిద్రలో ఉండగానే కాల్చి చంపారు. ఇరు పక్షాల కాల్పుల్లో మరో ఐదుగురు సాయుధులు ప్రాణాలు కోల్పోయినట్టు మణిపూర్‌ పోలీసులు పేర్కొన్నారు. చూర్‌చాంద్‌పుర్‌లోని మువాల్‌సంగ్‌, లైకా మువాల్సు గ్రామాల్లో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి మూడు బంకర్లను పోలీసులు కూల్చేశారు. బిష్ణుపుర్‌ జిల్లా లోయలోని గ్రామాల్లో డ్రోన్ల సహాయంతో బాంబు, రాకెట్‌ దాడులు ఇక్కడి నుంచే నిర్వహించినట్లు తెలుస్తోంది. రాకెట్‌ దాడుల్లో ఓ వద్ధుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

➡️