- భద్రతా దళాల దాడిలో ఒకరు మృతి
- మణిపూర్‌లో బస్సు సర్వీసులను పలుచోట్ల అడ్డుకున్న నిరసనకారులు
ఇంఫాల్ : మహిళా దినోత్సవం రోజునే కుకీ మహిళలపై భద్రతా దళాలు విరుచుకుపడ్డాయి. పలుచోట్ల బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతోపాటు లాఠీఛార్జి చేశారు. మణిపూర్‌లో అంతర్ జిల్లాల బస్సు సర్వీసులను పునరుద్ధరించిన నేపథ్యంలో భద్రతా బలగాలకు, కుకీ జో గ్రూపునకు మధ్య పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. పలుచోట్ల బస్సులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. కంగ్పోకి జిల్లాలో జరిగిన ఈ ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించాడు. జిల్లాలోని పలు సబ్ డివిజన్‌ల్లో ప్రజల, వాహనాల కదలికలపై ఆంక్షలు విధించారు. రెండవ నెంబరు జాతీయ రహదారిపై ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వచ్చాయి. జిల్లా మేజిస్ట్రేట్ మహేష్ చౌదరి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంఫాల్ నుండి సేనాపతి జిల్లాకు వెళుతున్న ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్సును ఆపడానికి ప్రయత్నించి, ప్రైవేటు వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. తమకు ప్రత్యేక పరిపాలన వచ్చేంతవరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దని డిమాండ్ చేస్తూ కాంగ్‌పోక్సి జిల్లాలో కుకీలు శనివారం నిరసన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో బస్సులను అడ్డుకోవడంతోపాటు రాళ్లు రువ్వారు. పలుచోట్ల రోడ్లను దిగ్బంధించారు. గో బ్యాక్ అని నినాదాలు చేశారు. కుకీ నిరసనకారులను భద్రతా దళాలు చెదరగొట్టేందుకు ప్రయత్నించాయి. పలుచోట్ట భద్రతాదళ సిబ్బంది లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణల్లో కొంతమంది కుకీ మహిళలకు గాయాలయ్యాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే గాంగిఫై, కాంగ్‌పోక్పి జిల్లాలో నిరసన చేసిన కుకీ మహిళలు క్రూరమైన హింసను ఎదుర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై పురుష పోలీసులు విరుచుకుపడ్డారు. బలప్రయోగం ద్వారా శాంతిని ఎప్పటికీ సాధించలేము అని ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియో.. మణిపూర్‌లో ఈ హింసను ఆపండి అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అవుతున్నాయి.
రెండేళ్ల క్రితం మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలతో నిలిచిపోయిన అంతర్ జిల్లా బస్సుల రాకపోకలను శనివారం ఉదయం పునరుద్ధరించారు. ప్రయాణికులెవరూ లేకుండానే ఈ బస్సులు ప్రయాణించాయి. భారీగా కేంద్ర బలగాల కాన్వారులతో ఈ బస్సులు వెళ్లాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మార్గాల్లో ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు వీలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి భద్రతా బలగాలను ఆదేశించడంతో ఈ బస్సు సర్వీసులను పునరుద్ధరించారు.