మణిపూర్‌ హింసాకాండ

  • ఆస్తుల దగ్ధం, లూటీ, ఆక్రమణల వివరాలు ఇవ్వండి
  •  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం

న్యూఢిల్లీ : మణిపూర్‌లో గత ఏడాది మే నుంచి కొనసాగుతున్న హింసాకాండ నేపథ్యంలో పూర్తిగా, పాక్షికంగా దగ్ధమైన భవనాలు, లూటీలు, ఆక్రమణల గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. అక్రమంగా ఆస్తులను ఆక్రమించిన వారిపై తీసుకున్న క్రిమినల్‌ చర్యలు, యజమానులకు చెల్లించిన పరిహారం వంటి వివరాలను కూడా అందించాలని పేర్కొంది. హింసాకాండ కారణంగా నిరాశ్రయులైన ప్రజలు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్‌ సంజరు కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటీషన్‌ తరుపున న్యాయవాదులు ‘మణిపూర్‌లో హింసాకాండ అంతం కాలేదు. భారత ప్రభుత్వంపై అక్కడి ప్రజలు విశ్వాసం కోల్పోయారు’ అని తెలిపారు. ‘అది మాకు తెలుసు’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. మణిపూర్‌ తరుపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు పైన తెలిపిన ఆదేశాలను జారీ చేసింది. పూర్తి వివరాలను సీల్డు కవరులో అందించాలని సిజెఐ ఆదేశించగా, అందిస్తామని తుషార్‌ మెహతా తెలిపారు. ఇలాంటి పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారించనవసరం లేదని, కోర్టు నియమించిన జస్టిస్‌ గీతా మిట్టల్‌ ప్యానెల్‌ ముందు ఉంచవచ్చునని మెహతా అన్నారు. తదుపరి విచారణను 2025 జనవరి 20 నుంచి ప్రారంభమయ్యే వారానికి ధర్మాసనం జాబితా చేసింది.

➡️