ముంబయి: పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతి పట్ల రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రతన్ టాటా మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. ‘‘భారత్ ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయింది. ఆయన చేసిన సేవలు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తిదాయకం’’ అని పేర్కొన్నారు.
అత్యున్నత వ్యక్తిని కోల్పోయాం : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
రతన్ టాటా మరణం పట్ల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంతాపం తెలిపారు. ‘‘అత్యున్నత వ్యక్తిని కోల్పోవడం బాధాకరం. ఎంతో మంది పారిశ్రామిక వేత్తలకు ఆయన మార్గదర్శకంగా నిలిచారు’’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.
దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ
రతన్ టాటా మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త. దయగల అసాధారణ వ్యక్తి. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం, జంతు సంక్షేమం వంటి వాటిలో అతను ముందు వరుసలో ఉన్నారు. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యారు’’అని పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారని కొనియాడారు.
రతన్ టాటా మరణం పట్ల లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్ టాటా శాశ్వత ముద్ర వేశారన్నారు. ఆయన కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మానవతావాదిని కోల్పోయాం : ఏపీ సీఎం చంద్రబాబు
రతన్ టాటా మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తమదైన దృష్టితో ప్రపంచంపై ముద్రవేసిన కొందరు వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరు. మనం ఒక వ్యాపారవేత్తనే కాదు.. నిజమైన మానవతావాదిని కోల్పోయాం. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి, దాతృత్వశీలిగా జాతి నిర్మాణంలో ఆయన పాత్ర తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రతన్ టాటాను అభిమానించేవారికి, టాటా గ్రూప్‌నకు తన ప్రగాఢ సానుభూతి’’ అని చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
అసాధారణ ప్రయాణం : తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి
భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. భారతదేశ కార్పొరేట్ ప్రపంచంలో దూరదృష్టి గల నాయకుడు, మానవతావాది. టాటా జీవితం వినయం, విజయంతో కూడిన అసాధారణ ప్రయాణం అని పేర్కొన్నారు.
కుమారుడిని కోల్పోయింది : మల్లికార్జున ఖర్గే
‘‘భారతదేశం అమూల్యమైన కుమారుడిని కోల్పోయింది. ఆయన లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం. దేశ నిర్మాణానికి రతన్ టాటా ఎంతో సహకారం అందించారు’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
భారతదేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిన పారిశ్రామిక వేత్త : విజయన్
రతన్ టాటా మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం ప్రకటించారు. భారతదేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిన పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేరళ అభివృద్ధికి ఆయన అందించిన మద్దతు ఎప్పటికీ గుర్తుండి పోతుందని అన్నారు. వారికుటుంబ సభ్యులకు, టాటా గ్రూప్‌కు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు.
దేశ పారిశ్రామిక రంగంలో నిజమైన టైటాన్ : తమిళనాడు సిఎం
భారతదేశ పారిశ్రామిక రంగంలో నిజమైన టైటాన్ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. వినయం, దయ, కరుణకు మార్గదర్శి అయిన రతన్ టాటా మృతికి విచారిస్తున్నాను. దూరదృష్టితో టాటా గ్రూప్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా భారత వ్యాపార రంగంలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పారని అన్నారు. దేశ నిర్మాణం, ఆవిష్కరణలు మరియు దాతృత్వానికి ఆయన నిర్విరామ కృషి, అంకితభావం మిలియన్ల జీవితాలపై చెరగని ముద్రవేసిందని అన్నారు. భారతదేశం ఓ గొప్ప దిగ్గజాన్ని కోల్పోయిందని, ఆయన వారసత్వం భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అన్నారు. ఈ విషాదసమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, సహచరులకు, టాటా గ్రూప్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తునానని అన్నారు.
అసాధారణమైన సేవలు : సుందర్ పిచాయ్
రతన్ టాటా మరణం పట్ల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో అసాధారణమైన సేవలు అందించినట్లు పేర్కొన్నారు. భారత్‌ను మెరుగుపర్చడంపై ఆయన ఎంతో శ్రద్ధ వహించారని తెలిపారు.
రతన్‌టాటా దార్శనికత కలిగిన నేత : బిల్‌గేట్స్
ముంబయి : రతన్‌టాటా దార్శనికత కలిగిన నేత అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ గురువారం పేర్కొన్నారు. రతన్‌టాటా ఆలోచన తీరు ఎల్లప్పుడూ తనను కదిలించేదని అన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ఆయన అంకితభావం భారతదేశం మరియు ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందని అన్నారు.
స్ఫూర్తిదాయకం : ప్రియాంకా చోప్రా
రతన్ టాటా మరణం పట్ల బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వ వారసత్వం, దాతృత్వం తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని పేర్కొంది. దేశం కోసం ఆయన చేసిన ప్రతిదానికీ అసమానమైన అభిరుచి, అంకితభావానికి ధన్యవాదాలు తెలియజేశారు.
నా హీరో : కమల్ హాసన్
రతన్ టాటా మరణం పట్ల నటుడు కమల్ హాసన్ సంతాపం వ్యక్తం చేశారు. ”రతన్ టాటా నా వ్యక్తిగత హీరో. నా జీవితాంతం నేను అనుకరించడానికి ప్రయత్నించాను. ఆధునిక భారతదేశ కథలో ఎప్పటికీ నిలిచిపోయే జాతీయ సంపద. అతని నిజమైన సంపద భౌతిక సంపదలో కాదు, అతని నీతి, సమగ్రత, వినయం మరియు దేశభక్తిలో ఉంది. 2008 ముంబయి దాడుల తర్వాత, ఐకానిక్ తాజ్ హోటల్‌లో బస చేస్తున్నప్పుడు నేను అతనిని కలిశాను. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు టైటాన్ గా నిలబడ్డారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, టాటా గ్రూప్‌కు & తోటి భారతీయులకు ప్రగాఢ సానుభూతి.” అని ఎక్స్ లో పోస్టు చేశారు.