సాయిబాబా మృతి పట్ల పలువురు సంతాపం

Oct 13,2024 08:29 #passed away, #Professor Saibaba

యంత్రాంగం: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, రచయిత, విద్యావేత్త సాయిబాబా మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా కడసారి విడ్కోలుకు, స్మరించుకోవడానికి, 14 అక్టోబర్ 2024(సోమవారం) ఉదయం 10 గంటల నుండి తమతో  పాలుపంచుకునేందుకు ఆహ్వానిస్తున్నామని డా.జి.ఎన్.సాయిబాబా కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న  శ్రీనివాస హైట్స్ వద్ద నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. సాయిబాబా కోరిక మేరకు ఆయన దేహాన్ని పరిశోధనల నిమిత్తం ఆసుపత్రికి అప్పగిస్తామని తెలిపారు.

 సాయిబాబా మృతికి మోదీ ప్రభుత్వమే కారణం : సిపిఎం

మోడీ ప్రభుత్వ అణచివేత విధానాలకు బాధితుడు, ఒక దశాబ్దం పాటు జైలు శిక్ష అనుభవించిన జిఎన్ సాయిబాబా మరణానికి భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) సంతాపం తెలియజేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కొన్నాళ్ల పాటు ఆయనకు బెయిల్ నిరాకరించబడిందని సిపిఎం పేర్కొంది. తీవ్రమైన వైకల్యాలున్న వ్యక్తికి అత్యవసరంగా అవసరమైన వైద్య చికిత్సను తిరస్కరించారని తెలిపింది. న్యాయం కోసం పోరాడటానికి ఆయన జీవితాన్ని అంకితమిచ్చారని, హింసను ధైర్యంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. ఆయన మృతికి మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని వెల్లడించింది. న్యాయం కోసం పోరాడిన వీర యోధుడికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన భార్య వసంత, కుమార్తె మంజీరలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

జైలులో 3588 రోజులు : ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు 

కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సాయిబాబా మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ”సామాజిక ఉద్యమకారుడు, పౌర హక్కుల ఉద్యమ నాయకుడు, ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాను. పాలకుల విధానాల ఫలితంగా ఆయన జైలులో 3588 రోజులపాటు ఉన్నారు. ఆయనకు బెయిల్ రాకుండా పాలకులు ఎంతో కష్టపెట్టారు. అంగ వైకల్యంతో ప్రొఫెసర్ సాయిబాబా వీల్ చైర్ లోనే తిరిగేవారు. ఆయన మరణం పౌరుహక్కుల ఉద్యమానికి తీవ్ర లోటు” అని తెలుపుతూ ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

నివాళులు : సంగమం 

అణగారిన ప్రజల పక్షాన పోరాడుతూ సుదీర్ఘ కాలం రాజ్యహింసకు గురియై, దశాబ్దం పాటు నిర్బంధ జైలు జీవితం గడిపి గత మార్చిలో నిర్దోషిగా విడుదలైన ప్రొఫెసర్ సాయిబాబా తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ గత రాత్రి హైదరాబాద్ నిమ్స్ లో తుది శ్వాస విడిచారు. సంగమం సంస్థ ఆధ్వర్యంలో సాయిబాబాకి ఇవాళ సాయంత్రం 6 గంటలకు లెనిన్ పార్క్ లో నివాళులు అర్పించనున్నామని తెలిపారు. భావసారూప్య మిత్రులందరికీ ఈ విషయం తెలియపర్చి అందరూ హాజరయ్యేలా క్రృషి చేద్దామని పేర్కొంది.

సమన్విత, అనువాద మిత్ర మండలి ప్రగాఢ సంతాపం

కవి, మేధావి, అధ్యాపకుడు, అనువాదకుడు, సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్ సాయిబాబాని అక్రమ కేసుల్లో నిర్బంధించి తొమ్మిదేళ్ల జీవితాన్ని, ఆయన ఆరోగ్యాన్ని హరించింది కేంద్ర ప్రభుత్వం. మార్చిలో విడుదల అయిన దగ్గర్నుంచీ తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. ఈ పోరాటం నిన్నటితో భౌతికంగా ముగిసింది. సాయిబాబా పంచిన స్ఫూర్తి కొనసాగుతుంది. ఆయన మరణానికి సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే.  ఈ దుఃఖాన్ని అందరితో కలిసి పంచుకుంటూ సమన్విత, అనువాద మిత్ర మండలి సాయిబాబాకి జోహార్లు అర్పిస్తున్నాయి. ఆయన సహచరి వసంత, కుమార్తె మంజీరాలకి సమన్విత, అనువాద మిత్ర మండలి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి.

➡️