శాంతియుతంగా కవాతు – నేడు రైతుల కార్యాచరణ ప్రకటన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : శాంతియుతంగా ఢిల్లీకి కవాతు చేస్తామని, లేదంటే సరిహద్దు ప్రాంతాల్లో ధర్నాలు బలోపేతం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ‘డిల్లీ చలో’ నిరసన కొనసాగుతుందని రైతులు శనివారం పునరుద్ఘాటించారు. ఫిబ్రవరి 21న ఖనౌరీ సరిహద్దులో హర్యానా పోలీసులు పెల్లెట్‌ గన్స్‌, భాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో మరణించిన యువ రైతు శుభకరన్‌ సింగ్‌కు సంతాపం తెలుపుతూ ఆదివారం నిర్వహించే సభ అనంతరం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ”సరిహద్దులలో హర్యానా భద్రతా బలగాలు అడ్డుకోకపోతే శాంతియుత పద్ధతిలో ఢిల్లీకి మార్చ్‌ చేస్తాం. లేకపోతే, మేము ఇప్పటికే ఉన్న సరిహద్దుల వద్ద ఆందోళనను బలోపేతం చేస్తాం. పంజాబ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా మరిన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తాం” అని కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా (కెఎంఎం) సభ్యుడు రమణదీప్‌ సింగ్‌ మాన్‌ చెప్పారు. కెఎంఎం కోఆర్డినేటర్‌ సర్వన్‌ సింగ్‌ పంధేర్‌, బికెయు (క్రాంతికారి) ప్రధాన కార్యదర్శి బల్దేవ్‌ సింగ్‌ జిరా, బికెయు-ఏక్తా (ఆజాద్‌) అధ్యక్షుడు జస్వీందర్‌ సింగ్‌ లాంగోవాల్‌ మాట్లాడుతూ ”శాంతియుతంగా వెళ్లేందుకు అనుమతిస్తే ఢిల్లీకి పాదయాత్ర చేస్తాం. లేకుంటే సరిహద్దుల్లో ధర్నాను మరింత ఉధృతం చేస్తాం” అని అన్నారు.

19వ రోజు కొనసాగిన రైతు ఆందోళన

అన్ని పంటలకు సి2 ప్లస్‌ 50 శాతంతో కూడిన ఎంఎస్‌పి హామీతో పంట సేకరణ చట్టం తీసుకురావాలని, రైతులకు రుణ రుణమాఫీ చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన ఆందోళన శనివారానికి 19వ రోజుకు చేరుకుంది. హర్యానా-పంజాబ్‌ సరిహద్దులు శంభూ, ఖానౌరీ ప్రాంతాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది.

➡️