దళిత సమస్యలపై పోరు – రాష్ట్ర అసెంబ్లీ, గవర్నర్ల కార్యాలయాలకు మార్చ్‌

Aug 8,2024 22:55 #Dalit issues, #fight, #march

-సెప్టెంబరు 15 నుంచి 30 వరకు ఆందోళన
-దళిత హక్కుల సమన్వయ కమిటీ పిలుపు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్త పోరుకు దళిత హక్కుల సమన్వయ కమిటీ సిద్ధమైంది. ఈ మేరకు గురువారం నాడిక్కడ స్థానిక ఎపి, తెలంగాణ భవన్‌లో దళిత హక్కుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత హక్కుల సమన్వయ కమిటీ నేతలు సుభాషిణి అలీ (డిఎస్‌ఎంఎం), మల్లేపల్లి లక్ష్మయ్య (సెంటర్‌ ఫర్‌ దలిత్‌ స్టడీస్‌), బి వెంకట్‌, విక్రమ్‌ సింగ్‌ (ఎఐఎడబ్ల్యుయు), విఎస్‌ నిర్మల్‌ (ఎఐడిఆర్‌ఎం), థీరేంద్ర ఝా (ఎఐఎఆర్‌ఎల్‌ఎ), గుల్జార్‌ సింగ్‌ గోరియా (బికెఎంయు) తదితరులు మాట్లాడారు. తొలుత సుభాషిణి అలీ మాట్లాడుతూ.. బడ్జెట్‌ కేటాయింపుల్లో దళితులకు జరుగుతున్న అన్యాయం, 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై జరుగుతున్న అకృత్యాలపై చర్చ జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం కొన్ని ముఖ్యమైన డిమాండ్లను లేవనెత్తిందని, రాజ్యాంగ, దళితుల భద్రత, ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు, జనాభాకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీర్ఘకాలిక సామాజిక ఉద్యమాలతో దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను పరిరక్షించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యవాదులు, బ్యూరోక్రాట్లు, ఇతరులతో పాటు ఇలాంటి డిమాండ్ల కోసం పనిచేస్తున్న అన్ని సంఘాలూ ఈ రాజ్యాంగ, ప్రజాస్వామ్య ఉద్యమంలో పాల్గనాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.
సామాజికంగా గుర్తింపు లేని దళితులకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించడమే సబ్‌ప్లాన్‌ ఉద్దేశమని, అయితే ప్రభుత్వం ఈ నిధులను దళితుల ప్రత్యేక కార్యక్రమాలకు ఖర్చు చేయకుండా, సాధారణ కార్యక్రమాలకు మళ్లిస్తోందని విమర్శించారు. అనేక ఏళ్లుగా వివిధ సంఘాల నిరంతర కృషి కారణంగా కొన్ని రాష్ట్రాలు ఎస్‌సి సబ్‌ప్లాన్‌ చట్టాన్ని అమలు చేశాయని, కాని కేంద్ర ప్రభుత్వం ఎస్‌సి సబ్‌ప్లాన్‌ చట్టాన్ని అమలు చేయడానికి, సబ్‌ప్లాన్‌ నిధులను సరిగ్గా కేటాయించడానికి సిద్ధంగా లేదని విమర్శించారు. కావున పార్లమెంటు సమావేశంలో ఎస్‌సి సబ్‌ప్లాన్‌ కోసం చట్టం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. బిజెపి ప్రభుత్వం కోర్టులో రిజర్వేషన్లను సమర్థవంతంగా సమర్థించడంలో విఫలమైందని, వాటిని అమలు చేయనందుకు తరచూ కోర్టును సాకుగా చూపుతోందని దుయ్యబట్టారు.
మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15, 16, 17 దళితులకు అంటరానితనం నుండి నిర్దిష్ట రక్షణలను అందిస్తాయని, కాని స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా.. దళితులు అంటరానివారిగానే కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వాలు ప్రైవేటీకరించడం దళితుల ప్రయత్నాలను బలహీనపరుస్తుందని, ప్రభుత్వం ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, వీలైనంత త్వరగా ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. బి వెంకట్‌ మాట్లాడతూ.. దేశంలో వ్యవసాయోత్పత్తి ఎక్కువగా గ్రామాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేసే దళితులపైనే ఆధారపడి ఉందని, ఏటా 30 కోట్ల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో దళితులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులతో పాటు ప్రధాన స్తంభాలుగా ఉన్నారని తెలిపారు. ఇంత జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. బిజెపి ప్రభుత్వ హయాంలో కుల ఆధారిత దౌర్జన్యాలు పెరిగాయని, వీటిని ఇప్పుడు ప్రభుత్వ స్పాన్సర్డ్‌గా భావిస్తున్నారని విమర్శించారు. దళితులపై నేరాలకు పాల్పడుతున్న వారికి మోడీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని, దళితులకు భూ పంపిణీ, రాజ్యాంగ పరిరక్షణ, ఇళ్ల స్థలాలు, ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకతను చర్చించినట్లు తెలిపారు.
డిమాండ్స్‌ ఇవీ…
ఎస్‌సి సబ్‌ప్లాన్‌ చట్టాన్ని అమలు చేయాలి. జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయించాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. ప్రైవేటీకరణను అంతం చేయాలి. పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. దళితులపై అఘాయిత్యాలు, అంటరానితనాన్ని తక్షణమే నిలిపేయాలి. రాజ్యాంగం ప్రకారం దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు కల్పించాలి. దళితులకు విద్యా, భూ హక్కులు, అనుకూలమైన పని వాతావరణం కల్పించాలి. జనగణనతోపాటు సామాజిక, ఆర్థిక కుల గణన నిర్వహించాలి. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి.

➡️