సిపిఎం స్పష్టీకరణ
కాశ్మీర్ అమరవీరులకు ఘనంగా నివాళి
పలువురు కాశ్మీరీ నేతల గృహ నిర్బంధం
శ్రీనగర్ : ఆధునిక కాశ్మీర్ చరిత్రలో ముఖ్యమైన రోజుల్లో 1931 జులై 13 ఒకటి. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బాధితులు, అణచివేతకు గురైన ప్రజలు 1931లో చేసిన తిరుగుబాటు చరిత్ర నుండి చెరిపివేయలేం. ఇంతటి చారిత్రక దినాన్ని అధికారికంగా జరుపుకోవడానికి అనుమతించకపోవడం, అమరవీరులకు నివాళులర్పించేందుకు మజారి షుహుదాను సందర్శించకుండా అడ్డుకోవడమనేది కాశ్మీర్ చరిత్రను మార్చేందుకు, ప్రజల హృదయాల్లో నెలకొన్న జ్ఞాపకాలను తుడిచిపెట్టేందుకు చేసే ప్రయత్నంగా వుందని సిపిఎం విమర్శించింది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చర్యలు తీసుకున్నా తమ ప్రజల మనసులు, హృదయాల నుండి ఈ చారిత్రక దినం జ్ఞాపకాన్ని తొలగించలేరని సిపిఎం నేత తరిగామి స్పష్టం చేశారు. మన ప్రజలకు మరింత మెరుగైన భవిష్యత్తు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారికి సిపిఎం ఘనంగా నివాళులర్పిస్తోందని అన్నారు. నియంతృత్వం, నిరంకుశత్వం సంకెళ్ల నుండి సమాజానికి విముక్తి కల్పించేందుకు సాహసోపేతులైన ఈ వీరులు చేసిన త్యాగాలను ఎన్నటికీ మర్చిపోలేమన్నారు.
పలువురు కాశ్మీరీ నేతల అరెస్టు
1931లో జులై 13న డోగ్రా పాలకుని సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన 22మంది కాశ్మీరీలకు ఘనంగా నివాళులర్పించేందుకు గానూ అమరవీరుల సమాధి వద్దకు వెళ్లకుండా పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తి సహా పలువురు రాజకీయ నేతలను అరెస్టు చేశారు. తన నివాసం నుండి బయటకు వెళ్లడానికి లేకుండా తనను గృహ నిర్బంధంలో వుంచారని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కాశ్మీరీల స్ఫూర్తికి నిదర్శనంగా వున్న ఈ కార్యక్రమాన్ని ఎవరూ తొక్కివేయలేరని ఆమె వ్యాఖ్యానించారు.
పీపుల్స్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సజాద్ లోనెను కూడా ఇల్లు కదలనీయకుండా నిర్బంధించారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనమేమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. ఆ అమరవీరులందరూ కాశ్మీరీ హీరోలని వ్యాఖ్యానించారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, మరో నేత నసీర్ అస్లామ్ వనీ సహా పలువురు నేతలు ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.