‘ఉపాధి’ పథకం నుంచి భారీగా కార్మికుల తొలగింపు

న్యూఢిల్లీ : ఏడాదికి వంద రోజుల పని దినాలు పొందే చట్టబద్ధమైన హక్కును కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని, ఆ చట్టం కింద అమలవుతున్న ఉపాధి పథకాలను నిర్వీర్యం చేసేవిధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుయుక్తులను కొనసాగిస్తూనేవుంది. ఒక వైపు బడ్జెట్‌లో నిధులు తెగ్గోస్తూ మరోవైపు సాంకేతిక ఇబ్బందులు సృష్టిస్తూ వివిధ రూపాల్లో చట్టాన్ని నీరుగారుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో ఉపాధి జాబ్‌ కార్డులను తొలగించి లబ్దిదారుల సంఖ్యను తగ్గిస్తోంది. ఈ పథకం కింద ప్రతి గ్రామీణ కుటుంబానికీ ఓ జాబ్‌ కార్డు అందజేశారు. ఈ కార్డు లేని వారికి పథకం వర్తించదు. అయితే జాబ్‌ కార్డులోని సభ్యుల పేర్లను తొలగించడానికి చట్టంలో కొన్ని నిబంధనలు పొందుపరిచారు. వాటిని ఆసరాగా చేసుకొని 2021-22లో 1.49 కోట్ల మంది కార్మికుల పేర్లను కార్డుల నుండి తొలగించారు. 2022-23 నాటికి ఆ సంఖ్య 5.53 కోట్లకు పెరిగింది. అంటే ఏకంగా 247 శాతం పెరిగిందన్న మాట. గత నాలుగు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా 10.43 కోట్ల మందిని ఈ పథకం నుండి దూరం చేశారు.

2022-23లో కార్మికులను అధిక సంఖ్యలో తొలగించడానికి ఓ కారణం ఉంది. ఉపాధి పథకానికి ఆధార్‌ ఆధారిత చెల్లింపుల విధానాన్ని (ఎబిపిఎస్‌) వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం అనేక సర్క్యులర్లు జారీ చేసింది. ఆధార్‌ ఆధారిత చెల్లింపుల విధానం పనిచేయాలంటే ముందుగా ప్రతి కార్మికుడి ఆధార్‌ నెంబరును జాబ్‌ కార్డుతో అనుసంధానించాల్సి ఉంటుంది. అయితే సరైన వెరిఫికేషన్‌ చేయకుండా జాబ్‌ కార్డులను తొలగించడమే ఫీల్డ్‌ ఆఫీసర్లు పనిగా పెట్టుకున్నారని, ఎబిపిఎస్‌ సమ్మతి శాతాన్ని పెంచడమే వారి లక్ష్యమని ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీలో ప్రచురితమైన ఓ పత్రం తెలిపింది. బీహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లా మదన్‌పూర్‌ బ్లాక్‌లో సుమారు 53 వేల కార్మికుల పేర్లను తొలగించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లోని బిర్‌భుమ్‌ జిల్లా మయురేశ్వర్‌-1 బ్లాక్‌లో 32 వేల పేర్లు గల్లంతయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లోనూ ఎక్కువ సంఖ్యలో జాబ్‌ కార్డులు, లబ్దిదారులను తొలగించారు.

➡️