అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది మృతి
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని దోడా జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో మేజర్ సహా నలుగురు సైనికులు మరణిచారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు, రాష్ట్ర పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ దోడా పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలోని దెసా అటవీ ప్రాంతంలో సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతుండగా రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇరు పక్షాల మధ్య దాదాపు 20 నిమిషాల పాటు సాగిన భీకర పోరులో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకుపారిపోయేందుకు యత్నించగా దళాలు వారిని వెంటాడాయి. ఈ క్రమంలో దట్టమైన అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మొత మోగింది. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా జరిపిన ఈ ఎదురుదాడిలో కెప్టెన్ బ్రిజేష్ థాపా, నాయక్ డి రాజేష్, జవాన్లు బిజేంద్ర, అజరు నారూకా చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ షాడో గ్రూపు పనేనని ఆర్మీ తెలిపింది. ఈ నెల 9న కథువాలో సైనిక కాన్వారుపై దాడి చేసింది కూడా కాశ్మీర్ టైగర్లే. సంఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆయనకు టెలిఫోన్‌లో పరిస్థితిని వివరించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్ గత మూడు వారాల వ్యవధిలో దోడా జిల్లా అడవుల్లో భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన మూడో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా అధికారులు చెబుతున్నారు.
సైనికుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాం
: జమ్మూకాశ్మీర్ ఎల్‌జి మనోజ్ సిన్హా
ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన సైనికుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం ప్రకటించారు. సోమవారం రాత్రి దోడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఎల్‌జి సోషల్ మీడియా ఎక్స్‌లో స్పందించారు. ‘మేం మా సైనికుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఉగ్రవాదుల, వారి భాగస్వాముల దుష్ట పన్నాగాలను అడ్డుకుంటాం. ఉగ్రవాదంపై పోరాటానికి ఐక్యంగా కదలిరావాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించండి. తద్వారా మేం ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రతరం చేయగలం. ఉగ్రవాదాన్ని నిర్మూలించగలం’ అని మనోజ్ సిన్హా తన పోస్ట్‌లో తెలిపారు. అలాగే మరణించిన సిబ్బందికి నివాళలర్పించారు. ‘దోడా జిల్లాలో మన ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీస్ సిబ్బందిపై జరిగిన పిరికిబంద దాడి గురించి తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను. మన దేశాన్ని రక్షించడంలో అత్యున్నత త్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులు. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని కూడా మనోజ్ సిన్హా తెలిపారు.