బిజెపియేతర రాష్ట్రాలకు భారీగా నిధుల కోత

Massive funding cut for non-BJP states

 కేరళ ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ విమర్శ

తిరువనంతపురం : బిజెపియేతర రాష్ట్రాల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో వివక్షను కొనసాగిస్తూనేవుంది. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లోనూ బిజెపియేతర రాష్ట్రాలకు మోడీ సర్కార్‌ మొండి చేయి చూపిందని కేరళ ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు ఆయన పోస్టు చేశారు. పన్నుల పంపిణీ విధానంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును ఆయన ఆక్షేపించారు. కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు అందుతున్న నిధుల శాతంలో తగ్గుదల కనిపిస్తోందని బాలగోపాల్‌ విశ్లేషించారు. ‘ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన మొత్తాన్ని, కేరళ వచ్చిన మొత్తాన్ని గమనించండి. ఈ పీరియడ్‌లో కేంద్రం సేకరించిన నిధులు 11 రెట్లు పెరిగాయి. కానీ, కేరళకు పన్నులో పెరుగుదల మాత్రం 8.8 రెట్లుగానే ఉన్నది. అంటే, ఇందులో భారీ తగ్గుదల ఉన్నది. అందుకే కేరళ, పంజాబ్‌, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు ఈ విషయాన్ని లేవనెత్తుతున్నాయి’ అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు కూడా బిజెపి ప్రభుత్వం అరకొర నిధులతోనే సరిపెడుతోందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై ఎనలేని భారాలు పడుతున్నాయని ఆయన తెలిపారు. దీంతో సామాజిక, సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ‘కేరళలో 62 లక్షల కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వాలి. కేంద్రం నుంచి చెల్లింపులు లేకపోవటంతో పింఛన్ల విడుదలలో జాప్యం జరుగుతున్నది’ అని ఆయన ఉదహరించారు. కేరళపై కేంద్రం వివక్ష చూపుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నేతృత్వంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమం జరిగిన విషయం విదితమే.

➡️