ప్రధాని మోడీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం

  • పార్లమెంట్‌ సమావేశాలు వదిలి.. విదేశీ టూర్లా.. : ప్రతిపక్షాలు

పోర్ట్‌లూయిస్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం దక్కింది. తమ దేశ అత్యున్నత పురస్కారం ”ది గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది స్టార్‌ అండ్‌ కీ ఆఫ్‌ ది ఇండియన్‌ ఓషన్‌”ను మోడీకి ఆ దేశ ప్రధాని నవీన్‌ రామ్‌గులాం ప్రకటించారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా మోడీ ఘనత సాధించారు.
మారిషస్‌ పర్యటనలో ఉన్న మోడీ.. ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం, ఆయన సతీమణి వీణా రామ్‌గులాంలకు ‘ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ)’ కార్డులు ప్రకటించారు.

పర్యటనలో భాగంగా అక్కడున్న భారతీయులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”పదేండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మారిషస్‌కి వచ్చాను. అప్పటికీ హౌలీకి పది రోజులే ఉంది. ఈ సారి హౌలీ రంగులను నాతో పాటు భారత్‌కు తీసుకెళ్తా. ఈ ప్రాంతానికి వస్తే నా సొంత ప్రదేశంలా అనుభూతి కలుగుతుంది. మనమంతా ఒకే కుటుంబం” అంటూ ప్రసంగించారు. అనంతరం.. తనను అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన మారిషస్‌ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

మంగళవారం ఉదయం మారిషస్‌ చేరుకున్న ప్రధాని మోడి అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు మోదీ ఈ పర్యటన చేపట్టనున్నారు. ఆ దేశ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
కాగా, పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధాని విదేశీ పర్యటనలకు వెళ్లడమేంటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.

➡️