- పొత్తులతో వెళ్తే తామే నష్టపోతున్నామని వెల్లడి
ఢిల్లీ : లోక్ సభ ఎన్నికలు దగ్గక పడుతున్న తరుణంలో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి కీలక ప్రకటన చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల వల్ల తామే ఎక్కువగా నష్టపోతున్నామని తెలిపారు. దేశంలోని చాలా పార్టీలు తమ పార్టీతో పొత్తు కోసం ఆసక్తిగా ఉన్నాయని… కానీ తాము ఒంటరిగానే ముందుకు సాగుతామన్నారు. పొత్తుల గురించి ఆలోచించాల్సి వస్తే ఎన్నికల తర్వాత చూస్తామని స్పష్టం చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతాననే ప్రచారం సాగుతోందని.. కానీ అందులో వాస్తవం లేదన్నారు. తుదిశ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టంచేశారు. రామమందిర ప్రాణప్రతిష్టకు సంబంధించి తనకు ఆహ్వానం అందిందన్నారు. అయితే, పార్టీ కార్యక్రమాల దృష్ట్యా వెళ్లాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.