‘అజ్మీర్‌ దర్గాలో సర్వే’పై మెహబూబా, సజాద్‌ ఆందోళన

శ్రీనగర్‌ : రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాలో సర్వేపై పిడిపి అధ్యక్షులు మెహబూబా ముఫ్తీ, జెకెపిసి అధినేత సజాద్‌ లోన్‌తో సహా జమ్ముకాశ్మీర్‌కు చెందిన రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దర్గాలో శివాలయం ఉందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌కు స్పందిస్తూ దర్గాలో సర్వేకు అనుమతిస్తూ స్థానిక కోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పు ఒక ఘోరమైన తప్పు అని, విభజనకాలం నాటి గాయాలను మళ్లీ రేకెత్తించేవిధంగా ఉందని ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని విద్వేషం, హింసాత్మక వాతావరణంలోకి నెట్టివేసే విధంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ముందుగా మసీదులు, ఇప్పుడు దర్గాలు లక్ష్యంగా మారాయని అన్నారు. సంభాల్‌ చోటుచేసుకున్న హింసాకాండను చూస్తే తాజా పరిణామాలు మరింత రక్తపాతానికి దారితీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. హింస చెలరేగినప్పుడు నష్టపోయేది రోజువారీ కూలీ, చిన్న దుకాణదారులు, రైతులు, గృహిణులే అని ఆమె పేర్కొన్నారు. జెకెపిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే సజాద్‌ గని లోన్‌ కూడా స్థానిక కోర్టు తీర్పుపై ‘తీవ్ర అసమ్మతి’ని వ్యక్తం చేశారు.

➡️