లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మిల్కిపూర్ నియోజకవర్గంలో నేడు ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ సందర్భంగా పోలింగ్ బూత్‌ల వెలుపలే పోలీసు సిబ్బంది ఓటరు గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపి అఖిలేష్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా పోలింగ్ బూత్ వెలుపల పోలీసు అధికారి ఓటరు కార్డును తనిఖీ చేస్తున్న ఓ ఫోటోను అఖిలేష్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే అఖిలేష్ ఆరోపణల్ని అయోధ్య సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) రాజ్ కరణ్ నయ్యర్ ఖండించారు. ఓటరు ఐడి కార్డులను తనిఖీ చేస్తున్న వ్యక్తి పోలింగ్ ఏజెంట్ అని, పోలీసు సిబ్బంది కాదు అని అన్నారు. అయితే అయోధ్య ఎస్‌ఎస్‌పి రాజ్ కరణ్ వ్యాఖ్యలను అఖిలేష్ యాదవ్ తోసిపుచ్చారు. మిల్కిపూర్ నియోజకవర్గం అయోధ్య జిల్లాలోనిదే. ఈరోజు పోలింగ్ జరుగుతున్నందున అయోధ్య పోలీసులే పోలింగ్ బూత్ వెలుపల ఓటర్ ఐడి కార్డులను తనిఖీ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సీనియర్ పోలీసుల అధికారుల ప్రమేయం కూడా ఉందని అఖిలేష్ అన్నారు. పోలీసుల తనిఖీలకు సంబంధించిన వార్తలను, చిత్రాలను ఎన్నికల సంఘం వెంటనే గుర్తించాలని అఖిలేష్ పేర్కొన్నారు. ఓటర్లలో భయాందోళనలు సృష్టించి ఓటింగ్‌ను పరోక్షంగా ప్రభావితం చేయడం ప్రజాస్వామ్య నేరమని అఖిలేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన పోలీసు అధికారులను, సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.
