- ప్రధాని మోడీకి ఢిల్లీ మంత్రి అతిషి లేఖ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న నీటి సంక్షోభాన్ని తక్షణం పరిష్కరించకుంటే ఈ నెల 21 నుంచి నిరవధిక దీక్షకు దిగుతానని ఢిల్లీ రాష్ట్ర మంత్రి అతిషి హెచ్చరించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రజానీకం ఎదుర్కొంటున్న నీటి కొరత, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటి పరిష్కారానికి తక్షణమే ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని బుధవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అతిషి తెలిపారు. ‘ఈ రోజు ప్రధాన మంత్రికి లేఖ రాశాను. ఢిల్లీలోని 28 లక్షల మంది ప్రజానీకానికి నీళ్లు రావడం లేదనే విషయాన్ని విన్నవించాను. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు నీరు అందేలా సాయం చేయాలని కోరాను. 21 నాటికల్లా ఢిల్లీ ప్రజలకు దక్కాల్సిన నీటి వాటా రాకుంటే సత్యాగ్రహానికి దిగడం మినహా నాకు మరో మార్గం లేదు’ అని అతిషి తెలిపారు. జలాలకు సంబంధించిన సింహ భాగం వాటాను హర్యానా విడుదల చేయకపోవడంతో ఢిల్లీ నీటి సంక్షోభంలో పడిందన్నారు. మంగళవారం నాడు 613 ఎంజిడిలకు గానూ 513 ఎంజిడిల జలాలను మాత్రమే హర్యానా విడుదల చేసిందని, ఒక్క ఎంజిడి జలం 28,500 మందికి వెళ్తుందని, ఆ ప్రకారం 28 లక్షల మందికి నీరు అందడం లేదని ఆమె వివరించారు. ఢిల్లీ ప్రజలు తీవ్రమైన ఎండలతోపాటు నీటి కొరతను ఎదుర్కొంటున్నారని వాపోయారు. హర్యానా ప్రభుత్వానికి కూడా సమస్య పరిష్కారం కోసం చాలా లేఖలు రాసినట్టు తెలిపారు.
ఆప్ సర్కారుపై బిజెపి ఎదురుదాడి
ఢిల్లీలో నీటి సంక్షోభానికి ఆప్ ప్రభుత్వమే కారణమంటూ బిజెపి, కాంగ్రెస్ రాష్ట్ర విభాగాలు బుధవారం ఇందిరా క్యాంప్ ఏరియాలో నిరసనలు చేపట్టాయి. హర్యానా ప్రభుత్వం పూర్తి నీటి వాటాను యమునా నదిలోకి వదిలిందని, అయితే జలాలు ఢిల్లీలోకి అడుగుపెట్టగానే ఆప్ మద్దతుతో ట్యాంకర్ మాఫియా ఆ నీళ్లు దొంగిలిస్తోందని ఢిల్లీ బిజెపి అధ్యక్షులు వీరేంద్ర సచ్‌దేవ్, ఎంపి బన్సూరి స్వరాజ్ ఆరోపించారు.