కంచె నిర్ణయంపై పునరాలోచించండి : ప్రధానికి మిజో విద్యార్థి సంఘం లేఖ

 ఐజ్వాల్‌ :   ఇండో-మయన్మార్‌ సరిహద్దుల మధ్య కంచె నిర్మాణం నిర్ణయంపై పునరాలోచించుకోవాలని మిజోరం విద్యార్థి సంఘం మంగళవారం ప్రధాని మోడీకి లేఖ రాసింది. ఈ లేఖను రాష్ట్ర గవర్నర్‌ హరిబాబు కంభంపాటి ద్వారా ప్రధానికి పంపింది. కంచె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అత్యున్నత విద్యార్థి సంఘం మిజో జిర్లారు పాల్‌ (ఎంజెడ్‌పి) ఆ లేఖలో పేర్కొంది. గిరిజనులు వీసా అవసరం లేకుండా సరిహద్దు దేశంలోకి 16కి.మీ ప్రయాణించే అవకాశం కల్పిస్తూ ఇండో-మయన్మార్‌ల మధ్య కుదిరిన పరస్పర అంగీకార ఒప్పందం ఎఫ్‌ఎంఆర్‌ రద్దవుతుందని పేర్కొంది. దీంతో ఇరు దేశాల్లో నివసిస్తున్న జో కమ్యూనిటీ మధ్య విభజన ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వలసరాజ్యాల కాలం నుండి పరిపాలనా విభాగంతో విభజించినా, వలసవాదం అంతమైన అనంతరం అంతర్జాతీయ సరిహద్దులు ఏర్పాటు చేసినా.. ఇప్పటివరకు  జో ప్రజలు విడిపోయినట్లుగా భావించడం లేదని ఆ లేఖలో పేర్కొంది. ఎఫ్‌ఎంఆర్‌ వివాహ వేడుకలు, అంత్యక్రియలు, రోగులను సందర్శించడం, మతపరమైన సమావేశాల్లో పాల్గనడం సహా స్థానిక క్రీడా టోర్నమెంట్‌లలో పాల్గనడానికి అవకాశం కల్పించింది.

కంచెతో ఎఫ్‌ఎంఆర్‌ రద్దవుతుందని, దీంతో ఈ అవకాశాలను కోల్పోతామని, గిరిజనుల హక్కులను పోగొట్టుకుంటామని పేర్కొంది. డ్రగ్స్‌ అక్రమ రవాణా, స్మగ్లింగ్‌ వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టవచ్చని పేర్కొంది. భారతదేశ-మయన్మార్‌ సరిహద్దుల్లో నివసిస్తున్న జో ప్రజల సాంస్కృతిక-సామాజిక అంశాల పరిరక్షణపై దృష్టి సారించాల్సిందిగా అభ్యర్థించింది.

శనివారం గువహటిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇండో -మయన్మార్‌ సరిహద్దులో కంచె వేయనున్నామని, మయన్మార్‌తో ఎఫ్‌ఎంఆర్‌ను రద్దు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని మిజోరాం ముఖ్యమంత్రి లాల్దుహోమా ప్రకటించారు. అయితే కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు.

➡️