- రెండేళ్లలో తుది నివేదిక
- అసెంబ్లీలో తమిళనాడు సిఎం స్టాలిన్ ప్రకటన
చెన్నై : కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను, చట్టాలు, విధానాలను సమీక్షించేందుకు, రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని, సమాఖ్యవాదాన్ని బలోపేతం చేసేందుకు తగు చర్యలు సిఫార్సు చేయడానికి ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రకటించారు. మంగళవారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. అసెంబ్లీలో 110వ నిబంధన కింద స్టాలిన్ ప్రకటన చేస్తూ… సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్, ఈ ఉన్నత స్థాయి కమిటీకి నాయకత్వం వహిస్తారని తెలిపారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కె.అశోక్‌వర్ధన్‌శెట్టి, రాష్ట్ర ప్రణాళికా కమిషన్ మాజీ వైస్ ఛైర్మన్ ఎం.నాగనాథన్ కమిటీలో సభ్యులుగా వుంటారు. ఈ కమిటీ 2026 జనవరి నాటికి తాత్కాలిక నివేదికను అందజేస్తుందని, రెండేళ్లలోగా తుది నివేదికను అందజేస్తుందని భావిస్తున్నారు.
కమిటీ విధులు…
కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సంబంధాలకు సంబంధించి రాజ్యాంగంలోని నిబంధనలు, చట్టాలు, విధానాలను సమీక్షించడం, రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాకు తరలిపోయిన అంశాలను పునరుద్ధరించడానికి గల మార్గాలను సిఫార్సు చేయడం, పాలనాపరమైన సవాళ్లను అధిగమించ డానికి రాష్ట్రాలకు చర్యలు ప్రతిపాదించడం, దేశ ఐక్యత, సమగ్రతల విషయంలో రాజీ పడకుండా రాష్ట్రాలకు గరిష్టంగా స్వయం ప్రతిపత్తిని ఇచ్చేందుకు హామీ కల్పిస్తూ సంస్కరణలు సూచించడం, రాజమన్నార్ కమిటీ సిఫార్సులను, అలాగే ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో కేంద్రం – రాష్ట్ర సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ల సిఫార్సులను పరిశీలించడం ఈ ఉన్నత స్థాయి కమిటీ ఆదేశిక విధులుగా వున్నాయి.
ప్రతిసారీ గళం వినిపించాం…
దేశం పురోగమించాలంటే ప్రతి రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి వుండాలని స్టాలిన్ పేర్కొన్నారు. మరింత స్వయం ప్రతిపత్తి కావాలని తమిళనాడు నిరంతరంగా డిమాండ్ చేస్తూనే వుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ కూడా రాష్ట్ర ప్రతిపత్తిపై చొరవను తీసుకోని సమయంలోనే, 1969లో కళైంగర్ ఎం.కరుణానిధి జస్టిస్ పి.వి.రాజమన్నార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని వేశారని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించాల్సిందిగా ఆ కమిటీని కోరారని చెప్పారు. 1971లో ఆ కమిటీ సవివరమైన నివేదికను ఇచ్చింది. 1974 ఏప్రిల్ 6వ తేదీన, తమిళనాడు అసెంబ్లీ ఆ నివేదికలోని కీలకమైన సిఫార్సులను ఆమోదించిందని ముఖ్యమంత్రి వివరించారు. ఆ తర్వాత 1983లో కేంద్రం ప్రభుత్వం సర్కారియా కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. తర్వాత 2004లో పూంఛీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసిందని, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై మరింత కూలంకష పరిశీలన జరపాలని కోరిందన్నారు. ఈ కమిషన్లన్నీ బృహత్తర నివేదికలను అందజేసినా, ఇంతవరకు వాటిపై నిర్దిష్టంగా ఎలాంటి కార్యాచరణ లేదని స్టాలిన్ విమర్శించారు. ఆరోగ్యం, లా అండ్ ఫైనాన్స్ వంటి కీలకమైన అంశాలు రాష్ట్ర జాబితాలో వుండగా, వాటిని ఉమ్మడి జాబితాకు తరలించడానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
‘ఒకే రకమైన విద్యా విధానం’ పేరుతో నీట్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై రుద్దిందని అన్నారు. ఈ నీట్ వల్ల కొద్ది మంది విద్యార్ధులు మాత్రమే లబ్ది పొందుతున్నారని, పైగా కోచింగ్ సెంటర్లు వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. దీనివల్ల గ్రామీణ, నిరుపేద నేపథ్యమున్నవారు దెబ్బతింటున్నారన్నారు. జాతీయ విద్యా విధానం, 2020 కింద త్రి భాషా విధానాన్ని రుద్దేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. దీనివల్ల పరోక్షంగా తమిళనాడు విద్యార్థులపై హిందీ రుద్దబడుతోందన్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే ‘ద్రవిడ మోడల్’ ప్రభుత్వమైనందున రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తిరస్కరించినట్లు చెప్పారు.
పైగా ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రాతిపదికగా చూస్తే తమిళనాడుకు వచ్చే పన్నుల్లో వాటా గణనీయంగా తక్కువగా వుందన్నారు. జిఎస్‌టిని ప్రవేశపెట్టినపుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని గుర్తు చేశారు. జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు తమిళనాడు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందన్నారు. కానీ ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన పేరుతో రాష్ట్రం ఇబ్బందులకు గురవుతోందన్నారు. 2026లో జరగబోయే పునర్విభజన చర్యల వల్ల తమిళనాడు ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గుతుందన్నారు.