- తీహార్ జైలు నుంచి విడుదల
- భావోద్వేగానికి లోనైన కెసిఆర్ తనయ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అయిదు మాసాలుగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం బెయిలుపై విడుదలయ్యారు. ఆమె దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం రూ. 10 లక్షల పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. కవిత తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహ్తగి, వాదించగా, ఇడి తరుపున ఎస్పీ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది. దీంతో మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె తీహార్ జైలు నుంచి బయటకొచ్చారు. స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు ఆర్య, భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావును చూసి కవిత భావోద్వేగానికి లోనయ్యారు. వారిని పట్టుకుని బోరున ఏడ్చేశారు. ఆ తరువాత తమాయించుకున్నారు.
నన్ను జగమొండిని చేశారు: కవిత
జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరు కవిత మీడియాతో మాట్లాడుతూ, తనను, తన కుటుంబాన్ని ఇబ్బందికి గురిచేసిన వారు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. తాను ఇప్పుడే ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదని. తాను మొండిదాన్నే కానీ, మంచి దాన్ని అన్నారు. జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారని అన్నారు.
మార్చి 26 నుంచి జైల్లోనే
ఈ ఏడాది మార్చి 15న సోదాల పేరుతో ఇడి అధికారులు హైదరాబాద్ లోని కవిత నివాసానికి వెళ్లారు. అదే రోజు సాయంత్రం 5:20 నిమిషాలకు కవితను అరెస్ట్ చేసి అర్థరాత్రి ఢిల్లీలోని ఇడి హెడ్డాఫీస్‌కు తరలించారు. ఆ తరువాత ప్రత్యేక కోర్టు ముందు ఆమెను హాజరుపరచగా జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు.
రేవంత్ , బండి మధ్య చీకటి ఒప్పందం: బిఆర్‌ఎస్
కేంద్ర మంత్రి బండి సంజరు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. కవితకు బెయిల్ మంజూరు తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మాజీ మంత్రులు గంగుల, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కవిత బెయిల్ పై బిజెపి, కాంగ్రెస్ నేతల విమర్శలను ఖండించారు. కవిత బెయిల్ పై సంజరు కు అంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. సంజరు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. అందులో భాగంగానే బీఆర్‌ఎస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బెంగాల్ నుంచి రాష్ట్రానికి వచ్చిన అక్రమ డబ్బు, రాష్ట్రంలో రేవంత్ కుటుంబ సభ్యులు చేసిన స్కాంపై ఎందుకు సంజరు మాట్లాడడం లేదన్నారు. అలాగే.. హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీకి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎందుకు స్పందించడం లేదన్నారు.