‘మోడీ-అదాని భాయి భాయి’

బ్లాక్‌ మాస్క్‌లతో ప్రతిపక్షాల మార్చ్‌ శ్రీ నినాదాలతో దద్దరిల్లిన
ర్యాలీగా వెళ్లి అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన నేతలు
రాజ్యసభలో డబ్బుల కట్టల కలకలంపార్లమెంట్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘మోడీ-అదాని భాయి భాయి’ అంటూ ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ ఎంపిల నినాదాలతో పార్లమెంట్‌ ఆవరణ దద్దరిల్లింది. అదాని ముడుపుల వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో విచారణ జరిపించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు మార్చ్‌ నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఉభయ సభలు తిరిగి సమావేశం కావడానికి ముందు పార్లమెంట్‌ ఆవరణలో ప్రతిపక్ష పార్టీ ఎంపిలు ‘మోడీ – అదాని భాయి భాయి’ అని ఇంగ్లీష్‌లో రాసి ఉన్న బ్లాక్‌ మాస్క్‌లు ధరించి నిరసన తెలిపారు. చేతిలో ఎరుపు రంగులోని రాజ్యాంగ ప్రతిని పట్టుకొని పార్లమెంట్‌ పాత భవనం నుంచి పార్లమెంట్‌ ఆవరణలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు మార్చ్‌ నిర్వహించారు. ధర్నాలో ఇండియా బ్లాక్‌లోని కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్‌, ఆర్‌జెడి, జెఎంఎం, డిఎంకె, ఎన్‌సిపి, ఆప్‌, ఐయుఎంఎల్‌, విసికె, కేరళ కాంగ్రెస్‌ తదితర పార్టీల ఎంపిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మోడీ – అదాని ఏక్‌ హై, మోడీ-అదాని భాయి భాయి’ అంటూ పెద్దపెట్టున నినదించారు. ఈ మార్చ్‌ ముగింపులో భాగంగా అంబేద్కర్‌ వర్థంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. అదాని వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. అదానిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అదాని వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు మోడీ సర్కార్‌ భయపడుతోందని ప్రియాంక గాంధీ అన్నారు. ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదాని వ్యవహారంపై దద్దరిల్లిన లోక్‌సభ
లోక్‌సభను స్పీకర్‌ ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. అదాని వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో సభ సమావేశమైన కొద్ది నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపిలు ‘మోడీ-అదాని భాయి భాయి’ అని రాసిన నల్ల మాస్క్‌లు ధరించారు. తిరిగి ప్రారంభమైన సభలో కూడా అదే పరిస్థితి నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. ‘రాహుల్‌ గాంధీ ద్రోహి’ అని దూషించి నందుకు బిజెపి ఎంపి సంబిత్‌ పాత్రపై కాంగ్రెస్‌ ఎంపి హిబి ఈడెన్‌ ప్రివిలేజ్‌ నోటీసు దాఖలు చేశారు.

రూ.500 నోట్ల కట్టపై కలకలం
రాజ్యసభలో డబ్బుల కట్టల వ్యవహారంతో కలకలం సృష్టించింది. రాజ్యసభలోని గురువారం రూ.500 నోట్ల కట్టలు దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య గందరగోళం నెలకొంది. కాంగ్రెస్‌ ఎంపి అభిషేక్‌ సింఘ్వీ సీటులో దొరికాయని రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ అన్నారు. దీనిపై విచారణకు ఆదేశించానని తెలిపారు. అభిషేక్‌ సింఘ్వీ పేరు ఎత్తడంపై ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జరుగుతుందని చెప్పినప్పుడు, ఫలాన సభ్యుడి పేరును ఎలా ప్రకటిస్తారని ధ్వజమెత్తారు.

నేను 1.30 గంటలకే పార్లమెంట్‌ నుంచి వెళ్లిపోయాను : అభిషేక్‌ సింఘ్వీ
దీనిపై అభిషేక్‌ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ‘ఇప్పుడే మొదటిసారి విన్నా. ఇప్పటి వరకు దాని గురించి వినలేదు. నేను రాజ్యసభకు వెళ్ళేటప్పుడు ఒక రూ.500 నోటును తీసుకెళ్తాను. మొదటిసారి విన్నాను. నేను నిన్న మధ్యాహ్నం 12:57 గంటలకు సభలోకి వచ్చాను. మధ్యాహ్నం 1 గంటకు సభ్యులు ఎక్కువ మంది వచ్చారు. అప్పుడు నేను 1:30 గంటల వరకు అయోధ్య ప్రసాద్‌తో క్యాంటీన్‌లో కూర్చున్నాను. ఆపై పార్లమెంట్‌ నుంచి వెళ్లిపోయాను’ అని కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ సింఘ్వీ అన్నారు. తన సీటుపై ఉన్న నగదు గురించి తనకు తెలియదని, ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ప్రకటన ద్వారా మాత్రమే ఈ సంఘటన గురించి తెలుసుకున్నానని పేర్కొన్నారు.
రాజ్యసభలో నోట్ల ఘటనపై దర్యాప్తు చేయాలని అభిషేక్‌ సింఘ్వీ డిమండ్‌ చేశారు. తన సీటు నుంచి నగదు రికవరీ విచిత్రమని, ఇది ముమ్మాటికీ భద్రతాలోపమని పేర్కొన్నారు. ఎవరైనా సభ్యుడు సభకు గైర్హాజరైతే, ఆయన సీటుపైన గంజాయి వేయకుండా గాజు ఎన్‌క్లోజర్‌ ఏర్పాటు చేయాలని సింఘ్వీ డిమాండ్‌ చేశారు. ప్రతి సమస్యపై రాజకీయాలతో ముడిపెట్టడం మన వ్యవస్థను చెడుగా చూపుతుందని అన్నారు. సభలోని ప్రతిదీ ‘చౌక వ్యూహాలు’, ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీయకూడదని, ఎంపిల స్థాయిని కించపరిచేలా చేయరాదని అన్నారు. ఎంపిలు ఇంటికి వెళ్లే ముందు తమ సీటుకు తాళం వేసి ఉండేలా ప్రతి సీటు చుట్టూ ముళ్ల తీగలు వేయాలని లేదా గ్లాస్‌ ఎన్‌క్లోజర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

➡️