ప్రజా జీవితంలో కొనసాగే అర్హత మోడీకి లేదు : జైరాం రమేష్‌

May 15,2024 16:38 #Jairam Ramesh, #modi

రాంచీ : ప్రధాని నరేంద్ర మోడీ ముస్లింలు చొరబాటుదారులని, అత్యధిక పిల్లలను కంటారని రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. దేశ సంపదను ముస్లింలకు పంచి పెడుతుందని మోడీ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షపార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఆయన అన్న వ్యాఖ్యలపై మీడియా ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. తాను ప్రత్యేకంగా ముస్లింల గురించి మాట్లాడలేదని.. పేద కుటుంబాల గురించి మట్లాడానని మోడీ స్పష్టం చేశారు. ఒకవేళ హిందూ ముస్లింల గురించి మాట్లాడితే.. ప్రజాజీవితానికి అనర్హుడినని అన్నారు. తాజాగా మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కమ్యూనికేషన్‌ ఇంఛార్జి జైరాం రమేష్‌ మండిపడ్డారు. రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో హిందూ ముస్లింల చుట్టే తిరిగింది. అలాంటిది ఇప్పుడు ఆయన తానిలా అనలేదు అంటే అర్థమేంటి? హిందూ, ముస్లింలపై రాజకీయాలు చేయదలచుకుంటే ఆయన అన్నవిధంగానే మోడీ ప్రజాజీవితంలో కొనసాగేందుకు పనికిరారు. మన జాతీయ చిహ్నం కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. అయినా ప్రధాని మోడీ మాత్రం పొరపాటున కూడా నిజాలు మాట్లాడరు. ఆయన ఎప్పుడూ అసత్యాలే చెబుతారు. అసత్యమేవ జయతే అనే మూల సిద్ధాంతంతో పనిచేసే తొలి ప్రధాని మోడీ’ అని ఆయన దుయ్యబట్టారు. అసత్యాలతో పాలన సాగించే మోడీ ఓ బ్లఫ్‌మాస్టర్‌ అని జైరాం రమేష్‌ తీవ్రంగా విమర్శించారు.

➡️