యుద్ధోన్మాద ఇజ్రాయిల్‌ సేవలో మోడీ సర్కార్‌

-తొలి విడతలో 64 మంది నిర్మాణ కార్మికులు
– హెచ్చరికలు, భద్రతా ఆందోళనలు బేఖాతరు
న్యూఢిల్లీ :గాజాలో అమాయక పౌరుల ప్రాణాలను బలిగొంటున్న యుద్ధోన్మాద ఇజ్రాయిల్‌ సేవలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పరితపిస్తోంది. అంతర్జాతీయ సమాజం మొత్తంగా ఇజ్రాయిల్‌ యుద్ధ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉండగా..అనేక దేశాలు తమ కార్మికులను స్వదేశానికి రప్పించుకున్నాయి. మరోవైపు హమస్‌ నుంచి ప్రతిఘటన దాడులు జరుగుతుండటంతో ఇజ్రాయిల్‌ నుంచి నిర్మాణ, ఇతర రంగాల కార్మికులు స్వస్థలాలకు తిరిగివెళ్లిపోయారు. దీంతో ఇజ్రాయిల్‌లో కార్మికులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. నెతన్యాహు ప్రభుత్వం భారత్‌ నుంచి కార్మికులను పంపాలని కోరగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో ఉద్యోగాల కోసం భారత నిర్మాణ రంగ కార్మికులతో మొదటి బ్యాచ్‌ ఇక్కడ నుండి మంగళవారం బయలుదేరింది. ఇజ్రాయిల్‌ రాయబారి నార్‌ గిలాన్‌, భారత ప్రభుత్వ అధికారులు వారికి వీడ్కోలు పలికారు. గాజాలో యుద్ధం చేస్తున్న వేళ ఇజ్రాయిల్‌ ప్రభుత్వం నిర్మాణ రంగ కార్మికులు కావాలంటూ గతేడాది నవంబరులో భారత ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది. ఇందుకు అనుసరించాల్సిన ప్రక్రియపై ప్రధాని మోడీతో ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు చర్చలు జరిపారు. హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో గత కొద్ది మాసాలుగా 64 మంది కార్మికులను రిక్రూట్‌ చేసుకున్నారు. రాబోయే కొద్ది వారాల్లో దాదాపు 10 వేల మంది ఇజ్రాయిల్‌ వెళ్లనున్నారు. వీరందరూ ఎయిర్‌ ఇండియా, ఇతర చార్టర్డ్‌ విమానాల్లో వెళ్ళనున్నారని జాతీయ నైపుణ్యాల అభివృద్ధి మండలి తెలిపింది. ఇజ్రాయిల్‌ ఎంబసీ వీరికి వీడ్కోలు పలుకుతూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. రెండు దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు వీరు బయలుదేరి వెళుతున్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత విదేశాంగ శాఖ గతనెల 5న అక్కడికి వెళ్ళే ప్రయాణికులకు, పర్యాటకులకు వారి భద్రతపై హెచ్చరికలు జారీ చేసింది. భద్రతాపరమైన ఆందోళనలు నెలకొన్నప్పటికీ వీరిని పంపాలని భారత ప్రభుత్వం భావించింది. కాగా భారత కార్మికులను సురక్షిత ప్రాంతాలకే పంపాలనే హామీలను భారత ప్రభుత్వం ఏమైనా పొందిందా అని ప్రశ్నించగా విదేశాంగ శాఖ స్పందించడానికి తిరస్కరించింది.

➡️