- కాంగ్రెస్ వస్తేనే మార్పు
- హర్యానా ర్యాలీలో రాహుల్
చండీగఢ్ : మోడీ సర్కార్ పారిశ్రామిక వేత్తల కోసమే పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే.. హర్యానాలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలను నామరూపాల్లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. రైతుల సంక్షేమం, అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం వంటి అంశాల్లో కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా రాహుల్ ఎండగట్టారు. అంబాలా జిల్లా నరైన్‌గఢ్ ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మార్పు తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు న్యాయం (కాంగ్రెస్), మరోవైపు అన్యాయం (బిజెపి) ఉంది” అని అన్నారు. సామాన్యులు కష్టాలు పడుతుంటే పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఖాతాలో మాత్రం సునామీలా డబ్బులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ”అదానీ జీ గురించి ఆలోచించండి, అతను ఉదయాన్నే నిద్రలేస్తాడు, అతను పొలంలో పని చేయడు, నాగలిని ఉపయోగించడు, చిన్న వ్యాపారం చేయడు, కానీ మంచి ఆహారం తింటాడు, రాజభవనంలో నివసిస్తున్నాడు. డబ్బు వస్తూనే ఉంటుంది. అతని బ్యాంకు ఖాతాలో 24 గంటలు డబ్బులు పడుతూనే ఉంటాయి” అని రాహుల్ పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించడం లేదని, ఆర్మీలో చేరాలని భావించినప్పుడు అగ్నిపథ్ పథకానికి తలొగ్గేలా చేశారన్నారు. ”ఇది అగ్నివీర్ పథకం కాదు, జవాన్ల పెన్షన్ దొంగిలించడానికి ఇది ఒక మార్గం, ఇది కేవలం. సాధారణ జవాన్‌కు జీవితాంతం పెన్షన్ వస్తుంది. ఒక్క అగ్నివీర్‌కు పెన్షన్ రాదు. అంటే వారి జేబుల్లో నుంచి డబ్బు లాక్కున్నారు, అని రాహుల్ గాంధీ అన్నారు. ఇజ్రాయిల్, యుఎస్ కంపెనీలు ఆయుధాలు తయారు చేస్తాయి. అదానీ వాటిపై తన కంపెనీ లేబుల్‌ను వేస్తాడు, ఆపై భారత సైన్యం అదానీ డిఫెన్స్ నుంచి కొనుగోలు చేస్తుంది. అదానీ డబ్బు సంపాదిస్తాడు. అందులో సగం రాజకీయాలకు ఇవ్వబడుతుంది. పార్టీని, డబ్బును మోడీ మార్కెటింగ్‌కు ఖర్చు చేస్తున్నారు” అని ఆయన ఆరోపించారు. అంబానీ, అదానీలకు ఎంత డబ్బు ఇచ్చారో, అదే మొత్తాన్ని రైతులు, పేదలు, కూలీలు, దళితులకు ఇవ్వాలన్నదే తన లక్ష్యమని అన్నారు. మోడీ ప్రభుత్వం అదానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు రూ.16 లక్షలు రుణమాఫీ చేసి రైతుల రుణమాఫీ చేయలేదని విమర్శించారు. ”హర్యానాలో ప్రస్తుతమున్న ప్రభుత్వం అవసరం లేదనీ, రైతులు, కార్మికులు, పేదల ప్రభుత్వం” అవసరమున్నదని అన్నారు. హర్యానాలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ ”మార్పు” గురించి మాట్లాడుతుందని, రాష్ట్ర ప్రజలను ”అవమానించే” వారిని అధికారం నుంచి తరిమికొట్టాలని ప్రియాంక గాంధీ అన్నారు. ర్యాలీలో సీనియర్ నేత కెసి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.