మోడీ ప్రభుత్వమే కారణం.. సాయిబాబా మృతిపై ప్రతిపక్షాల విమర్శ

న్యూఢిల్లీ : హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా మృతికి కేంద్రంలోని మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఇది సహజ మరణం కాదు, సర్కారీ హత్య అని కాంగ్రెస్‌, సమాజ్‌వాది, ఆర్జేడి,సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్‌) తదితర పార్టీలు పేర్కొన్నాయి. ఆయనను నిరంకుశ మోడీ సర్కార్‌ చంపేసింది. మనమంతా మౌనంగా ఉండిపోయాము’ అని కాంగ్రెస్‌కు చెందిన లోక్‌సభ సభ్యుడు కార్తి చిదంబరం వ్యాఖ్యానించారు. నిరంకుశ విధానాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నదని సాయిబాబా ఈ సమాజానికి బోధించారని ఆర్‌జెడి ఎంపీ మనోజ్‌ కె.ఝా చెప్పారు. రాజ్యహింసకు సాయిబాబా బలయ్యారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాగరిక ఘోష్‌ తెలిపారు.

న్యాయం కోసం పోరాడిన యోధుడు :సిపిఎం
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్‌) కేంద్ర కమిటీ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ, చాలా కాలం పాటు బెయిల్‌ నిరాకరించడం వల్లే సాయిబాబా ఆరోగ్యం దెబ్బతిన్నదని పేర్కొంది. తీవ్రమైన వైకల్యాలున్న వ్యక్తికి అత్యవసరమైన వైద్య చికిత్సను తిరస్కరించారని తెలిపింది. ఆయన మతికి మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొంది. న్యాయం కోసం పోరాడటానికి ఆయన జీవితాన్ని అంకితమిచ్చారని, హింసను ధైర్యంగా ఎదుర్కొన్నారని కొనియాడింది. న్యాయం కోసం పోరాడిన ఆ వీర యోధుడికి నివాళులర్పించింది. ఆయన భార్య వసంత, కుమార్తె మంజీరలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

వ్యవస్థీకృత హత్య: డి రాజా
సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్పందిస్తూ, ప్రొఫెసర్‌ సాయిబాబాకు ప్రాథమిక మానవ హక్కులు సైతం నిరాకరించబడ్డాయని, కాబట్టి ఆయనది సహజ మరణం కాదు, వ్యవస్థీకృత హత్య అని అన్నారు. ఉపా వంటి క్రూరమైన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని ఆయన అన్నారు. సిపిఐ (మార్క్సిప్టు-లెనినిస్ట్‌) లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య స్పందిస్తూ ఇది ముమ్మాటికీ సర్కారీ హత్యేనని అన్నారు. సాయిబాబా మరణం ఉపా ఫలితమేనని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. మన క్రిమినల్‌ న్యాయ వ్యవస్థలోని లొసుగులను సాయిబాబా మరణం బయటపెట్టిందని న్యాయ శాఖ మాజీ మంత్రి అశ్వినీ కుమార్‌ అన్నారు. ఆ ప్రక్రియే శిక్ష వంటిదని వ్యాఖ్యానించారు. న్యాయ సంస్కరణలు తీసుకొచ్చి, కస్టడీ వేధింపులకు వ్యతిరేకంగా సమగ్ర చట్టం చేయడమే సాయిబాబాకు అర్పించే నిజమైన నివాళి అని చెప్పారు.

➡️