Kharge : ఉపాధి లేకుండా చేయడమే మోడీ లక్ష్యం : ఖర్గే

న్యూఢిల్లీ : యువతకు ఉపాధి లేకుండా చేయడమే మోడీ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే విమర్శించారు. నిరుద్యోగంపై వెలువడిన పలు సర్వేలను ఉదహరిస్తూ బిజెపిపై ఆయన మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా కోట్లాది మంది యువకుల కలలను చిన్నాభిన్నం చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని అన్నారు. దేశంలో ప్రస్తుత నిరుద్యోగ రేటు 9.2 శాతానికి చేరిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఇ) నివేదిక పేర్కొంది. ఐఎల్‌ఒ నివేదిక ప్రకారం.. దేశంలోని నిరుద్యోగుల్లో 83 శాతం యువత ఉన్నారు. ఇండియా ఎంప్లాయిమెంట్‌ రిపోర్ట్‌ 2024 ప్రకారం.. 2012-2019 మధ్య సుమారు 7 కోట్ల మంది యువత శ్రామిక శక్తిలో చేరారని, ఉపాధిలో సున్నా వృద్ధి -0.01 మాత్రమేనని ఖర్గే పేర్కొన్నారు. దేశంలోని 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లలో 42.3 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని ఖర్గే 2023 అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీ నివేదికను ప్రస్తావించారు. భారతదేశంలో ఏడాదికి 1.2 కోట్ల ఉద్యోగాలు అవసరం. 7 శాతం జిడిపి వృద్ధి కూడా యువతకు తగినంతగా ఉద్యోగాలను సృష్టించదని, మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో సగటున 5.8 శాతం జిడిపి వృద్ధి రేటు మాత్రమే సాధించిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ప్రైవేట్‌ సెక్టార్‌, స్వయం ఉపాధి లేదా అసంఘటిత రంగం ఏదైనా మోడీ ప్రభుత్వ ఏకైక లక్ష్యం యువతకు ఉపాధి లేకుండా చేయడమేనని ఖర్గే విమర్శించారు.

➡️