అరుదైన లోహాలను కొల్లగొట్టేందుకు మోడీ సర్కార్‌ కసరత్తు

  • దిండిగల్‌ సభలో ప్రకాశ్‌ కరత్‌ విమర్శ

చెన్నయ్ : దేశ ప్రజలపై భారాలు మోపుతూ, ప్రకృతి సంపదను ధ్వంసం చేస్తూ దేశంలోని బడా కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమల్జేస్తోందని సిపిఎం సమన్వయకర్త, పొలిల్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. దేశంలో అత్యంత అరుదైన ఖనిజాలను కూడా భూగర్భం నుంచి వెలికి తీసి ఆ సంపదనంతా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోడీ సర్కార్‌ సిద్ధమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. మదురైలో టంగ్‌స్టన్‌ సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అత్యంత అరుదైన ఖనిజాలను తవ్వితీసి బడా కార్పొరేట్లకు కోట్లవర్షం కురిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్యాచరణ ప్రకటించిందని, ఈ దుర్మార్గమైన విధానాన్ని ప్రజలందరూ తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మదురైలో అరుదైన టంగ్‌స్టన్‌ ఖనిజ తవ్వకాలను చేపట్టాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించడాన్ని కరత్‌ ఈ సందర్భంగా స్వాగతించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు జి రామకృష్ణ, కేంద్ర కమిటీ సభ్యులు యు వాసుకి తదితర నాయకులు పాల్గొన్నారు.

➡️