కోడ్‌ ఉల్లంఘనుడు మోడీ

Apr 19,2024 08:50 #BJP, #coments, #cpm, #modi, #Sitaram Yechury
  •  ఆయన ప్రకటనలు ఇసి నియమావళికి విరుద్ధం
  •  ఇప్పటికే ఫిర్యాదు చేశాం : ఏచూరి

కోజికోడ్‌ : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదేపదే ఉల్లంఘిస్తూ వచ్చారని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మోడీ ప్రకటనల్లో అత్యధికంగా ఇసి నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రజల్లో చీలికలు తీసుకొచ్చేలా విద్వేషాలు రెచ్చగొట్టేలా మతాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ప్రసంగాలు దట్టించారు. ప్రధానంగా అయోధ్య ‘రాముడి’ అంశంపై మతతత్వానికి పదును పెట్టటమే లక్ష్యంగా మోడీ చేసిన ప్రకటనలు గుప్పించారు. ఈ ప్రసంగాల జాబితాను జత చేసి మోడీపై ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదు చేశామని ఏచూరి తెలిపారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఏచూరి మీడియాతో మాట్లాడారు. వామపక్ష కూటమిపై చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌గా కాంగ్రెస్‌, యుడిఎఫ్‌ను కూడా ఆయన విమర్శించారు. ‘ఎల్‌డిఎఫ్‌, ప్రత్యేకించి సిపిఎంను.. మోడీపై దాడి చేయకుండా మౌనంగా ఉన్నదని ఆరోపిస్తూ కాంగ్రెస్‌, యుడిఎఫ్‌లు ఆరోపించటం విచిత్రంగా ఉంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) వ్యతిరేకిస్తూ అరెస్టయిన తొలి రాజకీయ నాయకులలో నేనూ ఉన్నా. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో రాజకీయ నాయకులను నిర్బంధించారని పేర్కొంటూ సుప్రీంకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది వామపక్ష పార్టీనే. ఎన్నికల బాండ్లను స్వీకరించకుండా అవి రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏకైక రాజకీయ పక్షం సిపిఎం’ అని సీతారాం ఏచూరి గుర్తు చేశారు. ఈ సమస్యలన్నింటిలో, అనేక ఇతర విషయాలలో కాషాయ పార్టీని వ్యతిరేకించటంలో సిపిఎం ముందున్నదనీ, ఇన్ని సందర్భాల్లో బిజెపిని వ్యతిరేకించలేదని మాపై ఆరోపణలు చేసేవారు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. సిపిఎం వటకర లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కెకె శైలజపై సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏచూరి ఈ ప్రకటన చేశారు. ఆమెపై జరుగుతున్న ప్రచారాన్ని ‘తీవ్రమైన, అసభ్యకరమైనది’గా ఆయన అన్నారు. ఇది ఆమె ఎన్నికల్లో విజయం సాధించినట్టు సూచిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు పార్టీని వీడి బిజెపిలో చేరినందున ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఏచూరి కోరారు. వ్యక్తిగత దాడులతో కాకుండా వాస్తవాలు, సారాంశాల ఆధారంగా మాట్లాడదామని ఆయన హితవు పలికారు. ప్రచార సమయంలో అందరూ గౌరవాన్ని, మర్యాదను కొనసాగించాల్సిన అవసరమున్నదని ఏచూరీ చెప్పారు. శైలజపై సోషల్‌ మీడియా వేదికలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్‌ మిత్రపక్షమైన ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్‌) కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. శైలజపై సైబర్‌ దాడి వటకర కాంగ్రెస్‌ అభ్యర్థి షఫీ పారంబిల్‌కు తెలిసే జరుగుతున్నదని ఆరోపిస్తూ ఆయనపై ఎన్నికల సంఘానికి కూడా సిపిఎం ఫిర్యాదు చేసింది. కేరళలో షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 26న లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

➡️