న్యూఢిల్లీ : ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో ప్రధాని మోడీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విఫలమయ్యారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరిందని, పేదవాళ్లు మరింత పేదలుగా మారుతుంటే, సంపన్నులు మరింత సంపన్నులవుతున్నారని అన్నారు. ”ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారైనా అదానీ గురించి మాట్లాడటం మీరు చూశారా? బిలియనీర్ల దేశం మాకవసరం లేదు” అని రాహుల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నుంచి రాహుల్ గాంధీ ప్రచారం ప్రారంభించారు. సీలాంపూర్ ప్రాంతంలో జరిగిన ‘జై బాపు, జై భీం, జై సంవిధాన్’ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ధ్వంసం చేస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీని పారిస్‌గా మారుస్తామని, అవినీతిని నిర్మూలిస్తామని కేజ్రీవాల్ ప్రచారం చేశారనీ, కానీ కాలుష్యం పెరిగిందని, ద్రవ్యోల్బణం తారాస్థాయిలో ఉందని రాహుల్ అన్నారు. వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్, కులగణనను కేజ్రీవాల్ కోరుకుంటున్నారా? అని ప్రజలు ఆయనను ప్రశ్నించాలని సూచించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే గతంలో ఢిల్లీని ఏవిధంగా అభివృద్ధి చేశామో ఆ విధంగా చేసి చూపిస్తామని, ఆ పని కేజ్రీవాల్ కానీ, బిజెపి కానీ చేయలేదని రాహుల్ స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.
