ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి..: జమ్ముకాశ్మీర్‌ ఓటర్లకు మోడి, రాహుల్‌ విజ్ఞప్త్తి

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లో దాదాపు పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికలు బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలకు కీలకంగా మారిన నేపథ్యంలో ఇరు పార్టీలు ‘ఎక్స్‌’ వేదికగా చేసిన ట్వీట్స్‌లో తమ పార్టీలను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ‘ఓటర్లందరూ తమ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని’ ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కూడా ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ‘జమ్మూ కాశ్మీర్‌లోని నా సోదర సోదరీమణులరా… ఈరోజు రెండో దశ పోలింగ్‌ జరగనుంది. మీ హక్కులు, శ్రేయస్సు కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ‘ఇండియా’కు ఓటు వేయండి. ప్రత్యేక హోదాను తొలగించి బిజెపి ప్రభుత్వం మిమ్మల్ని అవమానించింది. మీ రాజ్యాంగ హక్కులతో ఆడుకుంది. మీరు ‘ఇండియా బ్లాక్‌కి ఓటు వేస్తే.. బిజెపి సృష్టించిన అన్యాయపు వలయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. జమ్మూకాశ్మీర్‌ను సుసంపన్నమైన మార్గంలో తీసుకొస్తుంది’ అని రాహుల్‌ తన ఎక్స్‌ పోస్టులో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం జమ్మూ కాశ్మీర్‌కు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

➡️