చంద్రచూడ్‌ ఇంటికి మోడీ వెళ్లకూడదు

  • జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ సిజెఐ డివై చంద్రచూడ్‌ ఇంటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్లకుండా ఉండాల్సిందని జస్టిస్‌ హృషికేశ్‌ రారు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తాజాగా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ హృషికేశ్‌ రారు తన పదవీ విరమణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఈ సంఘటన ప్రధాన న్యాయమూర్తి వ్యక్తిగత కార్యక్రమం. వాస్తవానికి ఈ దృశ్యాలు కొంత కలవరపెట్టేలా కనిపించాయి. కానీ గతాన్ని పరిశీలిస్తే, దానిని నివారించవచ్చని నేను నమ్ముతున్నా’ అని అన్నారు. అదే విధంగా ఒకవేళ మీడియా కవరేజ్‌ లేకుండా ఈ సమావేశం ప్రైవేట్‌గా జరిగి ఉంటే ఆందోళనలను రేకెత్తించకపోవచ్చని జస్టిస్‌ హృషికేశ్‌ రారు అభిప్రాయపడ్డారు. ‘ఈ కార్యక్రమం పూజాగది నుంచి ప్రజల దృష్టికి వెళ్లి అనవసరమైన ఊహాగానాలను సష్టించే సమస్యకు దారి తీసింది’ అని అన్నారు. అయితే ఈ సమావేశంలో ఇద్దరూ కూడా కోర్టుకు సంబంధించిన ఎలాంటి విషయాలను చర్చించలేదని, న్యాయమూర్తి నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరుగలేదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ‘జస్టిస్‌ చంద్రచూడ్‌ పూర్తిగా నిజాయితీపరుడు. దానిని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు’ అని జస్టిస్‌ రారు అన్నారు.
జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నివాసంలో జరిగిన గణపతి పూజా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనడంపై అప్పట్లో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

➡️