మోడీ ఆస్తులు రూ.3 కోట్లు.. 

May 15,2024 00:06 #nomination, #PM Modi
  • ఎక్కువ శాతం ఎఫ్‌డిలే

న్యూఢిల్లీ : వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి మోడీ బిజెపి అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం మోడీ ఆస్థుల విలువ రూ.3,02,06,889. ఇందులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే ఎక్కువగా ఉన్నాయి. ఎస్‌బిఐలో మొత్తం రూ.2.85 కోట్లు మోడీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. 45 గ్రాముల బరువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 2.67 లక్షలుగా తెలిపారు. రూ.52,920 చేతిలో ఉన్న నగదుగా తెలిపారు. రూ.9.12 లక్షలు విలువైన నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్స్‌ ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 3.33 లక్షల ఆదాయ పన్ను మినహాయింపును మోడీ పొందారు. అఫిడవిట్‌ ప్రకారం మోడీకి సొంత ఇల్లు, కారు లేదు. జశోధబెన్‌ను తన భార్యగా పేర్కొన్నారు. ఆమెకు ఉన్న ఆస్థుల గురించి తెలియదని స్పష్టం చేశారు. తనపై ఒక్క క్రిమినల్‌ కేసు కూడా పెండింగ్‌లో లేదని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌ నివాసిగా మోడీ పేర్కొన్నారు. 1967లో ఎస్‌ఎస్‌సి, 1978లో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి బిఎ డిగ్రీ, 1983లో గుజరాత్‌ యూనివర్శిటీ నుంచి ఎంఎ చదివినట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో మోడీ తన ఆస్థుల విలువ రూ. 2.5 కోట్లుగా ప్రకటించారు. 2014లో రూ.1.65 కోట్లుగా వెల్లడించారు.

➡️