కచ్చతీవుపై చిచ్చు రగిల్చేందుకు మోడీ యత్నం

Apr 2,2024 06:53 #PM Modi, #Rahul Gandhi

న్యూఢిల్లీ: కచ్చతీవు ద్వీపంపై చిచ్చు రేపి తమిళనాడులో రాజకీయంగా లబ్ధి పొందాలని మోడీ ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ దీవిని 1974లో శ్రీలంకకు కాంగ్రెస్‌ అప్పగించిందని మోడీ ఆరోపించారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె.అన్నామలైకి ఆర్టీఐ ద్వారా అందిన సమాధానం ఆధారంగా ఓ జాతీయ మీడియా విడుదల చేసిన నివేదికను షేర్‌ చేసిన అనంతరం ఆయన సోషల్‌ మీడియా ఎక్స్‌ లో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కచ్చతీవ్‌ను తేలిగ్గా వదులుకున్నందున కాంగ్రెస్‌ను నమ్మలేమని అన్నారు. హిందూ మహాసముద్రంలో చేపల లభ్యత తగ్గినప్పుడు, తమిళనాడు నుండి మత్స్యకారులు కచ్చతీవు ప్రాంతానికి వెళ్లేవారని, ఇప్పుడా అవకాశం లేకుండా పోయిందని అన్నారు. మోడీ ఆరోపణలపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే స్పందిస్తూ.. తమిళనాడులో బిజెపి ఖాతా తెరిచేస్థితి లేదని మోడీ గ్రహించారని, ఆ నిస్పృహతోనే కచ్చతీవ్‌ అంశాన్ని లేవనెత్తుతున్నారని ఆయన అన్నారు.

50 ఏళ్ల క్రితమే పరిష్కరించబడిన సమస్య : చిదంబరం
50 ఏళ్ల క్రితమే పరిష్కరించబడిన కచ్చతీవు సమస్యను ప్రధాని మోడీ ఇప్పుడు కెలకడం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పి చిదంబరం విమర్శించారు. శ్రీలంకతో సత్సంబంధాలను పెంపొందించుకునేందుకు, అక్కడి తమిళులను భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు కచ్చతీవుపై వివాదానికి ముగింపు పలకడం జరిగిందని ఆయన అన్నారు. కచ్చతీవు చాలా చిన్న దీవి. కేవలం 1.9 చ. కి. మీ విస్తీర్ణం కలిగిన తీవును శ్రీలంకకు చెందిన ప్రాంతంగా భారత్‌ గుర్తించడం జరిగింది. ఇందుకు ప్రతిగా 60 లక్షల తమిళులు భారత్‌కు వచ్చేందుకు శ్రీలంక అనుమతించింది. వారి కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి.
వారు ఇక్కడికి వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. వారి పిల్లలు, మనుమలు, మనుమ రాండ్రు ఇక్కడే జీవిస్తున్నారు. చైనాతో రెండు మూడేళ్ల క్రితం తలెత్తిన సమస్యను పరిష్కరించడం చేతకాని మోడీ ప్రభుత్వం 50 ఏళ్ల క్రితం పరిష్కారమైపోయిన సమస్య గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని చిదంబరం అన్నారు.

➡️