ఐదున్నరేళ్లలో ఐదుగురిపైనే ట్రయల్ పూర్తి
ఒకరికే శిక్ష
రాజ్యసభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాజకీయ నేతలను బెదిరించడానికి, బ్లాక్‌మెయిల్ చేయడానికి మనీలాండరింగ్ కేసులు (పిఎంఎల్‌ఎ)ను కేంద్రప్రభుత్వం ఉపయోగిస్తోన్నట్లు తేటతెల్లమైంది. ఐదున్నరేళ్లలో 132 మంది ప్రస్తుత, మాజీ ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై మనీలాండరింగ్ కేసులు నమోదు చేయగా, ఐదుగురిపైనే విచారణ పూర్తయిందని, ఒకరికే శిక్ష పడిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. మంగళవారం రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య 15 మంది, 2020 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య 28 మంది, 2021 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య 26 మంది, 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య 34 మంది, 2023 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య 26 మంది, 2024 జనవరి 1 నుంచి జూలై 31 వరకు ముగ్గురు రాజకీయ పార్టీ నేతలపై మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయి. 132 కేసుల్లో ఐదుగురిపైనే ట్రయల్ పూర్తయిందని, ఒకరిపైనే నేరం రుజువై శిక్ష పడిందని తెలిపారు.
తొమ్మిదేళ్లలో 8,719 యుఎపిఎ కేసులు
తొమ్మిదేళ్లలో 8,719 యుఎపిఎ కేసులు నమోదయ్యాయని కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద రారు తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2024 నుంచి 2024 వరకు పిఎంఎల్‌ఎ కేసులు 5,297 నమోదు చేశారు. 2024 నుంచి 2022 వరకు 8,719 పిఎంఎల్‌ఎ కేసులు నమోదు చేశారు.
విశాఖ పోర్టు సామర్ధ్యం పెరుగుదల, 15 ప్రాజెక్టుల పూర్తి
విశాఖపట్పం పోర్టు 15 ప్రాజెక్టులను పూర్తి చేసిందని కేంద్ర పోర్ట్సు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనివాల్ తెలిపారు. రాజ్యసభలో వైసిపి ఎంపి వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంతి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ పోర్టు రూ.1,354.73 కోట్ల విలువైన మొత్తం 26 ప్రాజెక్టులను చేపట్టగా, అందులో 15 ప్రాజెక్టులను పూర్తి చేసిందని, ఇంకా 11 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు. విశాఖపోర్టు సామర్ధ్యం ఉపయోగం (కెపాసిటి యుటిలైజేషన్)లో పెరుగుదల ఉందని, 2020-21లో 52 శాతం నుంచి ప్రస్తుతం 59.1 శాతానికి సామర్ధ్యానికి పెరిగిందని తెలిపారు.
