డిస్పూర్ : అస్సాంలోని దిమా హసౌ జిల్లాలో అనుమతులు లేని ఒక బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 10 మంది కార్మికులు గనిలో చిక్కుకున్నారు. గనిలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఆర్మీ, నేవీకి చెందిన బృందాలు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం విశాఖపట్నం నుంచి నిష్ణాతులైన నేవీ డైవర్లును కూడా రప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్రాంగ్సోకు సమీపంలోని ఈ బొగ్గు గనిలోకి సోమవారం ఉదయం వరద నీరు చేరడంతో ప్రమాదం సంభవించిందన్నారు. మంగళవారానికి మూడు మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. 300 అడుగుల లోతు ఉన్న ఈ గనిలో దాదాపు 100 అడుగుల వరకూ నీరు చేరుకుందన్నారు. గని నుంచి నీటిని పంపింగ్ చేసేందుకు యంత్రాలను కూడా వినియోగిస్తున్నారు. కాగా, ఈ గనికి ఎలాంటి అనుమతులు లేవని, కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.