సెన్సార్‌ లోపం వల్లే ముంగేష్‌పూర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు : ఐఎండి

Jun 2,2024 16:38 #Heatwave

న్యూఢిల్లీ : ఢిల్లీలో ముంగేష్‌పూర్‌లో మే 29వ తేదీన 52.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు తప్పు అని భారత వాతావరణశాఖ (ఐఎండి) తాజాగా వెల్లడించింది. వాస్తవానికి మే 28వ తేదీన ముంగేష్‌పూర్‌ స్టేషన్‌లో 49.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రికార్డయింది. ఆ మరుసటిరోజు అసాధారణంగా మూడు డిగ్రీలు పెరిగినట్లు చూపించిందని, ఇది సెన్సార్‌ లోపం వల్లే ఉష్ణోగ్రతలు తప్పుగా నమోదయ్యాయని ఐఎండి తెలిపింది. ఇక ఢిల్లీలోని పాలెంలో 1998లో మేలో అత్యధికంగా 48.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించాయి. సెన్సార్‌లోపం వల్ల మే 29వ తేదీన నమోదైన ఉష్ణోగ్రతలు పాలెం ఉష్ణోగ్రతల కంటే దాదాపు 4.5 డిగ్రీల మేర పెరిగి ఢిల్లీలో ఎన్నడూ లేని ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండి పేర్కొంది.
కాగా, ముంగేష్‌పూర్‌ ఒక ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్‌ (ఎడ్ల్యుఎస్‌). ఢిల్లీ అంతటా ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతంలో వైవిధ్యాలను కొలవడానికి ఐఎండి నియమించిన 16 వెదర్‌ స్టేషన్‌లలో ఈ ముంగేష్‌పూర్‌ స్టేషన్‌ కూడా ఒకటి. ఢిల్లీలో నిర్వహించే ఐదు మాన్యువల్‌గా నిర్వహించే వాతావరణ స్టేషన్‌లకు ఎడబ్య్లుఎస్‌లు భిన్నంగా పనిచేస్తాయి. అదే మాన్యువల్‌ వాతావరణ స్టేషన్‌లు రోజుకు నాలుగుసార్లు ఉష్ణోగ్రలను కొలిచేందుకు నివేదించే సాంప్రదాయ థర్మామీటర్‌ను చదివేందుకు వ్యక్తులు ఉంటారు. అయితే ఎడ్ల్యుఎస్‌లు మాత్రం పూర్తిగా సెన్సార్‌లపైనే ఆధారపడతాయి. ఇవి ఒక గంట ప్రాతిపదికన ఏజెన్సీ వెబ్‌సైట్‌లో సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు వాతావరణ విలువల్ని రూపొందిస్తుంది.
ఇక మహారాష్ట్రలోని నాగపూర్‌లో మే 30వ తేదీన 56 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు కూడా సెన్సార్‌ లోపం వల్లే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండి పేర్కొంది. ఈ సందర్భంగా ఐఎండి డైరెక్టర్‌ జనరల్‌ ఎం. మహపాత్ర పరికరాలను రీప్లేస్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్‌ క్వాలిటీ కంట్రోల్‌ లేదా ఎడబ్ల్యుఎస్‌ స్టేషన్‌ల నుండి అసాధారణ రీడింగ్‌లు నివేదించడుతున్నాయని, వీటిని పబ్లిక్‌ ప్లాట్‌ఫారమ్‌లలో వ్యాప్తి చేయడానికి ముందు తప్పనిసరిగా ధృవీకరించాలని ఇంటర్నల్‌ కమిటీ సిఫార్సు చేసింది.

➡️