- ఎన్నికల్లో అవకతవకలు జరగకపోతే గెలుస్తాం
- సిపిఎం ప్రతినిధుల బృందాన్ని కలిసిన రష్యా ఎంపిల బృందం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బహుళ ధృవ ప్రపంచానికి. కృషి చేయాల్సి ఉందని రష్యా కమ్యూనిస్టు పార్టీ ఎంపిలతో సిపిఎం నేతలు పేర్కొన్నారు. మంగళవారం నాడిక్కడ సిపిఎం కేంద్ర కార్యాలయం (ఎకె గోపాలన్ భవన్) వద్ద సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, సిపిఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. అరుణ్ కుమార్‌తో రష్కాలోని మాస్కో పార్లమెంట్ సభ్యులు నికోలే జి. జుబ్రిలిన్, టిమోఖోవ్ సెర్గీ కాన్స్టాన్షన్విచ్ సమావేశం అయ్యారు. అనంతరం సిపిఎం ఎంపిలు రాధాకృష్ణన్, అమ్రారామ్, బికాష్ రంజన్ భట్టాచార్య, సచ్చితానందం, వి. శివదాసన్, ఎఎ రహీమ్, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఆర్. అరుణ్ కుమార్‌తో కూడిన బృందంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రష్యా ఎంపిలు అక్కడి రాజకీయ పరిస్థితులను వివరించారు. కమ్యూనిస్టు పార్టీకి 20 శాతం ఓట్లు వచ్చాయని, ఎన్నికల్లో అవకతవకలు జరగకపోతే గెలిచేవాళ్లమని అన్నారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకల వల్లే కమ్యూనిస్టు పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం వెల్లడికావటం లేదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ఓటింగ్ వంటి పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ పద్ధతుల్లో ఓటింగ్ నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామని అన్నారు.
సోవియట్ యూనియన్ కాలం నాటి ఉచిత విద్యా, వైద్యం, ఇల్లు సంక్షేమ పథకాలను కాపాడేందుకు కమ్యునిస్టులు పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ, కమ్యూనిస్టుల పోరాటంతో విద్యా, వైద్యాన్ని పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామని తెలిపారు. రష్యా కమ్యూనిస్టు పార్టీలో 30-34 ఏళ్ల యువకులు పెద్ద సంఖ్యలో కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
రష్యా కమ్యూనిస్టు నేతలకు సిపిఎం నేతలు దేశంలోని పరిస్థితులను వివరించారు. అలాగే ఎప్పటి నుంచో రష్యాన్ కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం మధ్య ఉన్న సత్సంబంధాలను కొనసాగించాలన్నారు. ఇండియా, రష్యా దేశాల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయని, అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. అందుకే బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ)లను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.