ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నాక్ గ్రేడ్ కోసం లంచం కుంభకోణాన్ని ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్ ప్రకటన విడుదల చేశారు. అనుకూల గ్రేడ్‌ల కోసం లంచం ఇవ్వడం, తీసుకోవడం దారుణమైనదని పేర్కొన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ పాలనలో పెంచి పోషించిన అవినీతి వ్యవస్థ ప్రత్యక్ష ఫలితమే ఈ ఉదంతమని పేర్కొన్నారు. అర్హత లేని పార్టీ విధేయులు ఉన్నత విద్యా సంస్థల్లో కీలకమైన స్థానాల్లో చొరబడ్డారని, సంస్థలను మోసం, పక్షపాత కేంద్రాలుగా మారుస్తున్నారని విమర్శించారు.
‘ప్రొఫెసర్ రాజీవ్ సిజారియా లంచం కేసులో పట్టుబడిన ప్రొఫెసర్ మాత్రమే కాదు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపి వ్యక్తి. ప్రస్తుత యుజిసి ఛైర్మన్, మాజీ జెఎన్‌యు వైస్ ఛాన్సలర్ మామిడాల జగదీష్ కుమార్ ఆయనను నియమించారు. సిజారియా తొలుత కిర్లోస్కర్ జనరేటర్లకు సేల్స్‌మ్యాన్‌గా పనిచేశారు. ఆ తరువాత ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్‌లో చేరారు. 2020లో మామిడాల జగదీష్ కుమార్ ఆయనను జెఎన్‌యులో ఫ్యాకల్టీ సభ్యుడిగా నియమించారు. 2023 నాటికి ప్రస్తుత విసి శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ఆధ్వర్యంలో డీన్ పదవికి ఎదిగారు. విద్యాపరమైన ప్రతిభ ఆధారంగా కాకుండా రాజకీయ ప్రోత్సాహం ఆధారంగా ఎదిగారు. 2016లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఎబివిపి అధ్యక్షులుగా కూడా ఆయన ఉన్నారు. మామిడాల జగదీష్ కుమార్ సిజారియాకు జెఎన్‌యులో పదోన్నతి కల్పించడమే కాకుండా బిహెచ్‌యు కోర్టు, ఎఐసిటిఇ సలహా కమిటీ, నీట్, ఐఐఇఎస్‌టి శిబ్‌పూర్, ముఖ్యంగా నాక్‌లో కూడా పదవులు ఇచ్చారు. ఇప్పుడు అవినీతికి పాల్పడుతూ సిజారియా పట్టుబడ్డాడు. ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపి విద్యా సంస్థల్లో చొరబడటంతోపాటు అక్రమాలకు పాల్పడడాన్ని ఈ కేసు రుజువు చేస్తుంది. వాటిని మెరుగుపరచడానికి కాకుండా వాటిని అవినీతి, సైద్ధాంతిక నియంత్రణ కేంద్రాలుగా మార్చడానికి ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపి ప్రయత్నించాయని విమర్శించారు.
నాక్, యుజిసి అధిపతిగా ఉన్న మామిడాల జగదీష్ కుమార్ ఈ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ పాలనలో అదుపు లేకుండా పనిచేస్తున్న ఈ లంచం నెట్‌వర్క్‌లో పాల్గన్న ఇతరులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాక్ అక్రిడిటేషన్ ప్రక్రియపై వెంటనే దర్యాప్తు చేయాలని, అవినీతి అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం ఒక అవినీతి ప్రొఫెసర్ కేసు కాదని, ఇది భారతదేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసిన ఒక క్రమబద్ధమైన స్కామ్ అని పేర్కొన్నారు. ‘సంస్థలు అనుకూలమైన అక్రిడిటేషన్ రేటింగ్‌లను కొనుగోలు చేయగలిగితే, విద్యార్థులు మోసపోతున్నారని, విద్యా ప్రమాణాలను తారుమారు చేస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని నాశనం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి’ అని అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం విద్యార్థి సమాజం, ప్రగతిశీల శక్తులు ఐక్యంగా ఉండి విద్యారంగంలో ఈ కాషాయీకరణ అవినీతిని ప్రతిఘటించాలని విపి సాను, మయూక్ బిశ్వాస్ పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు గల శక్తులు మన విశ్వవిద్యాలయాలను రాజకీయ పక్షపాతం, లంచం, మోసానికి కేంద్రాలుగా దిగజార్చడానికి మనం అనుమతించలేమని పేర్కొన్నారు. పారదర్శక, న్యాయమైన, మెరిట్ ఆధారిత విద్యా వ్యవస్థ కోసం పోరాటం భారతీయ విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటమని తెలిపారు.
కుంభకోణం వివరాలివి…
దేశంలో ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్‌ఎఎసి) అనుకూల గ్రేడ్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడం వెలుగులోకి వచ్చింది. రిపబ్లిక్ డే రోజున జెఎన్‌యు ప్రొఫెసర్ రాజీవ్ సిజారియా ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి నాక్ తనిఖీ నివేదికను తారుమారు చేయడానికి క్యాంపస్‌లోని తన నివాసంలో లంచం కోసం చర్చలు జరిపారు. రాష్ట్రంలోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కెఎల్‌ఇఎఫ్) నుండి రూ.1.8 కోట్లు డిమాండ్ చేశారు. రూ.28 లక్షలకు ఒప్పందం ముగిసింది. ప్రొఫెసర్ రాజీవ్ సిజారియాకు ప్రధాన వాటా లభించింది. సిబిఐ సోదాలు నిర్వహించి, ప్రొఫెసర్ సిజారియాతో సహా పది మందిని అరెస్టు చేసింది.
కెఎల్ యూనివర్సిటీ అక్రిడిటేషన్ ఐదేళ్లపాటు నిషేధం
గుంటూరులోని కెఎల్ యూనివర్సిటీని ఐదేళ్ల పాటు అక్రిడిటేషన్ నుండి నిషేధించారు. అనిల్ సహస్రబుద్ధే నేతృత్వంలోని నాక్ కార్యనిర్వాహక కమిటీ రెండు రోజుల క్రితం అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. నాక్ కమిటీలోని ఏడుగురు సభ్యులపైనా జీవితకాలం పాటు నాక్, ఇతర కార్యకలాపాలలో నిషేధం విధించారు. 2018లో ఈ యూనివర్సిటీ నాక్ ఎ-గ్రేడ్‌లో అత్యధిక స్కోరును సాధించింది.