జెఇఇ మెయిన్స్‌లోమెరిసిన తెలుగు తేజాలు

  • ఫలితాలు విడుదల
  • 23 మందికి 100 శాతం స్కోరువారిలో ముగ్గురు ఎపి విద్యార్థులు

న్యూఢిల్లీ : జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జెఇఇ) మెయిన్స్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జెఇఇ) మెయిన్స్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) మంగళవారం విడుదల చేసింది. ఈ పేపర్‌-1 (బీఈ/బీటెక్‌) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు. వీరిలో 10 మంది దాకా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్‌ సూరజ్‌, తోట సాయి కార్తిక్‌, అన్నారెడ్డి తనీశ్‌ రెడ్డి 100 శాతం స్కోరు సాధించారు. అలాగే తెలంగాణ నుంచి ఏడుగురు విద్యార్థులు ఈ ఘనత సాధించారు. తెలంగాణకు చెందిన పబ్బ రోహన్‌ సాయి, ముతవరపు అనూప్‌, రిషి శేఖర్‌ శుక్లా, హుందేకర్‌ విదిత్‌, మదినేని వెంకట సాయి తేజ, తవ్వ దినేశ్‌ రెడ్డి, కల్లూరి శ్రియాషస్‌ మోహన్‌లు జేఈఈ మెయిన్‌ పేపర్‌ -1లో 100 శాతం స్కోరు సాధించారు. రాజస్థాన్‌, మహారాష్ట్ర నుంచి ముగ్గురు.. హర్యానా, ఢిల్లీ నుంచి ఇద్దరు.. గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు చొప్పున 100 శాతం స్కోరు సాధించారు. 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌-1 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, జెఇఇ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను జెఇఇ అధికారిక వెబ్‌ సైట్‌లో విద్యార్థులు తమ స్కోర్‌ కార్డును యాక్సెస్‌ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి ఫలితాలు పొందొచ్చు. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలో పర్సంటైళ్లతో పాటు మొత్తం జెఇఇ మెయిన్‌ పర్సంటైల్‌ కూడా తెలుసుకోవచ్చు. సెషన్‌ 1 తుది కీని ఎన్‌టిఎ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసిన విషయం తెలిసిందే. చివరి విడత (సెషన్‌ 2) ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టిఎ ఇప్పటికే ప్రకటించింది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెషన్‌ 1 రాసిన విద్యార్థులు సెషన్‌ 2కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.నరసాపురం కుర్రాడికి 99.4 శాతం2024 జెఇఇ మెయిన్స్‌ ఫలితాలలో 99.4 శాతం మార్కులతో పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి చెందిన కుర్రాడు కావలి యశ్వంత్‌ సత్తా చాటాడు. నరసాపురం 23 వ వార్డు కౌన్సిలర్‌ కావలి రామసీత నాని దంపతుల రెండవ కుమారుడు యస్వంత్‌ 99.4 శాతం మార్కులు సాధించడం పట్ల యశ్వంత్‌ కు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అభినందనలు తెలిపారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా నుంచి ఇద్దరు …అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని కె. గంగవరం మండలం సుందరపల్లి గ్రామానికి చెందిన అడపా తరుణ్‌ వెంకట లోకేష్‌ జెఇఇ మెయిన్‌ పరీక్షలో ప్రతిభ కనబర్చాడు. మాజీ సహకార సంఘం అధ్యక్షుడు అడపా నారాయణ స్వామి, మాజీ సుందరపల్లి సర్పంచ్‌ అడపా పద్మ సూర్య రామలక్ష్మి దేవి దంపతుల కుమారుడైన వెంకట లోకేష్‌ 99.36 శాతం స్కోర్‌ సాధించాడు. ఇదే జిల్లాలోని అలమూరు మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయులు, యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు అద్దరి శ్రీనివాసరావు కుమారుడు శ్రీసాయి విద్యాధర్‌ 99.1068 పర్సంటేజ్‌తో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. శ్రీసాయి విజయవాడ చైతన్య కాలేజీలో చదువుతున్నాడు. పదవ తరగతిలో 585 మార్కులతోనూ, పాలిసెట్లో రాష్ట్రస్థాయిలో 35వ ర్యాంక్‌ సాధించి విద్యాధర్‌ తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

➡️