Narayana Murthy : భారతీయులు జనాభా నియంత్రణపై శ్రద్ధ పెట్టలేదు : నారాయణ మూర్తి

ప్రయాగ్‌రాజ్‌ : ఎమర్జెన్సీ నుంచి జనాభా నియంత్రణలో భారతీయులు శ్రద్ధ చూపలేదని ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్‌ ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి అన్నారు. ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్‌ నెహ్రూ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ స్నాతకోత్సవానికి నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారతదేశం జనాభా, తలసరి భూమి లభ్యత విషయంలో, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు సంబంధించిన విషయాల్లో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎమర్జెన్సీ కాలం నుంచి జనాభా నియంత్రణపై భారతీయులమైన మనం తగినంత శ్రద్ధ చూపలేదు. దీనివల్ల మన దేశం అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది. మన దేశంతో పోల్చి చూస్తే.. అమెరికా, బ్రెజిల్‌, చైనా వంటి దేశాల్లో తలసరి భూమి లభ్యత చాలా ఎక్కువగా ఉంది. దేశ పురోగతికి దోహదపడడమే వృత్తి నిపుణుడి బాధ్యత. ఉన్నతమైన ఆకాంక్షలను కలిగి ఉండటం, కలల్ని కనడం, ఆ కలల్ని నిజం చేసుకునేందుకు నిపుణుల సహకారం, కృషి ఉండాలి. ఒకతరం వారి జీవితాలను బాగు చేయడానికి ఎన్నో త్యాగాలు చేయాలి. నా పురోగతికి నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఉపాధ్యాయులు ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగాలు వృథాకాలేదనడానికి నేనే నిదర్శనం’ అని నారాయణమూర్తి అన్నారు.
ఈ వేడుకలో 1,670 డిగ్రీలు ప్రదానం చేశారు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు 34, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు 13 బంగారు పతకాలు అందుకున్నారు.

➡️