భారత్‌కు తహవ్వూర్‌ రాణా

  • అరెస్టు చేసిన ఎన్‌ఐఎ

న్యూఢిల్లీ : ముంబయిపై ఉగ్రదాడులు 2008 సూత్రధారి తహవ్వూర్‌ హుస్సేన్‌ రాణాను భారత్‌కు అమెరికా అప్పగించింది. అమెరికా నుంచి తహవ్వూర్‌ రాణాను తీసుకొచ్చిన ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండయింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ), నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జి)కు చెందిన అధికారులతో కూడిన బృందం రాణాను అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ నుంచి ఈ ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. విమానాశ్రయంలో దిగిన వెంటనే రాణాను ఎన్‌ఐఎ అదుపులోకి తీసుకుంది. విచారణ కోసం ఎన్‌ఐఎ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. గురువారం రాత్రి రాణాను పాటియాలా హౌస్‌ కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్తగా కోర్టు ప్రాంగణాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. అక్కడ నుంచి మీడియా ప్రతినిధులను బయటకు పంపారు. 64 ఏళ్ల రాణా పాకిస్తాన్‌ సంతతికి చెందిన కెనడియన్‌-అమెరికన్‌.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నరేందర్‌మాన్‌

మరోవైపు ఈ కేసులో విచారణ, ఇతర విషయాల కోసం ప్రముఖ న్యాయవాది నరేందర్‌ మాన్‌ను మూడేళ్ల పాటు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియమించింది. రాణా తరుపున ఢిల్లీ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ నుంచి న్యాయవాది పియూష్‌ సచ్‌దేవ్‌ ప్రాతినిధ్యం వహించనున్నారు.
ముంబయి ఉగ్రదాడుల కేసులో రాణాపై 2011లోనే ఎన్‌ఐఎ ఛార్జిషిట్‌ దాఖలు చేసింది. లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ ఆదేశాల మేరకు ఈ దాడులకు ప్రణాళిక, నిఘా కార్యకలాపాలను నిర్వహించిన డేవిడ్‌ హెడ్లీ సహచరుడిగా ఎన్‌ఐఎ ఆరోపించింది. హెడ్లీ భారత్‌కు రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను రాణా పూర్తి చేసినట్లు తెలిపింది. తరువాత వీరిని 2009లో అమెరికాలో అక్కడి అధికారులు అరెస్టు చేశారు. అప్పట్ని నుంచి వీరి అప్పగింత కోసం భారత్‌ పోరాటం చేస్తూ వస్తోంది. హెడ్లీ అమెరికా పౌరుడు కావడంతో అప్పగించడానికి నిరాకరించిన ఆ దేశం రాణాను అప్పగించింది.

➡️