- కేరళ సాహిత్య వేత్తల పిలుపు
కన్నూర్ : సంకుచిత జాతీయవాద ధోరణుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వుండాల్సిందిగా ప్రగతిశీల చింతనాపరులకు, సాంస్కృతిక కార్యకర్తలకు కేరళ సాహిత్య వేత్తలు పిలుపునిచ్చారు. కన్నూర్‌లోని ఇ.కె.నయనార్ అకాడమీలో పురోగమన కళా సాహిత్య సంగమ్ 13వ రాష్ట్ర మహాసభ మంగళవారం నాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేరళ సాహిత్య అకాడమీ అధ్యక్షులు కె సచ్చిదానందన్ మాట్లాడుతూ దేశభక్తి పేరుతో దళితులు, ముస్లిమ్‌లపై హింస పెరగడాన్ని తీవ్రంగా ఖండించారు. సమైక్య హిందూ మతం అన్న భావనను ఆయన సవాలు చేశారు. భారత ప్రజల గురించి చెప్పేందుకు అరబ్బులు, యురోపియన్లు చారిత్రకంగా ఈ హిందూ పదాన్ని వాడేవారని ఆయన పేర్కొన్నారు. విభజించబడిన సమాజంలో ఏక హిందూమత భావన అన్నది అంతర్గతంగా లోపభూయిష్టంగా వుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొత్త పెట్టుబడిదారీవాదం, హిందూత్వల సంకీర్ణమని ఆయన అభివర్ణించారు. ఫాసిజానికి సంబంధించిన అన్ని శక్తులు ఈ కూటమిలో వున్నాయన్నారు. భారతదేశాన్ని స్వేచ్ఛా భూమిగా మార్చేందుకు నిరంతర పోరాటం కొనసాగించాలని, అవిశ్రాంతంగా ప్రతిఘటన చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. భాష, సాహిత్యం, కళా రూపాలను సాధనాలుగా ఉపయోగించుకోవాల్సి వుందన్నారు. వర్గ, నైతిక అసమాతనలను ఎదుర్కొనాలని ఆయన సాంస్కృతిక కార్యకర్తలకు పిలుపిచ్చారు. సమాజంలో పురుషాధిక్యత పెరిగిపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కొత్తగా తలెత్తుతున్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు సామాజిక వాణిని పరిపుష్టం చేయాల్సి వుందని, అత్యంత అప్రమతంగా వుండాల్సి వుందని ఆయన పునరుద్ఘాటించారు. కేరళవ్యాప్తంగా 3 వేలకు పైగా సాహిత్య సంగమ్ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధులు, 650 మంది రచయితలు ఈ మహాసభలో పాల్గొన్నారు.