- హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు
న్యూఢిల్లీ : ఇసుక తవ్వకాలను అక్రమంగా చేపట్టే చర్యలను నివారించేందుకు మూడు నెలల్లోగా జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సిపిసిబి)కు ఎన్‌జిటి శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలపై ఇచ్చిన తీర్పు సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. యుపిలో సిల్కోసిస్ వంటి వివిధ రకాల వ్యాధులతో ప్రజారోగ్యానికి ముప్పు కలుగుతోందని పేర్కొంది. సిలికా ఇసుక గనుల నుండి సిలికా ఇసుకను వెలికితీయడం వల్ల కార్మికులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అందువల్ల ఆ రంగంలో పనిచేసే కార్మికులకు సామాజిక, వైద్య సంక్షేమ చర్యలను చేపట్టాలని కోర్టు పేర్కొంది. యుపి రాష్ట్ర ప్రభుత్వం, యుపిపిసిబిలు సంబంధిత విభాగాలతో చర్చలు జరిపి, తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని కోరింది. బాధిత కార్మికులకు చికిత్స, ముందస్తు జాగ్రత్తల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇసుక గనుల తవ్వకాలను అక్రంగా చేపట్టే వివిధ ప్రైవేటు కంపెనీలకు పెనాల్టీలను కూడా విధించింది.