మేనిఫెస్టో విడుదల చేసిన శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సిపి

Apr 25,2024 15:59 #Maharashtra, #manifesto, #NCP (SP)

ముంబయి :    శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) మేనిఫెస్టో విడుదల చేసింది. ‘శపత్‌నామా’ పేరుతో ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ గురువారం విడుదల చేశారు. మేనిఫెస్టోలో మహిళలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. మహిళల భద్రత కోసం వారికి సంబంధించిన సైబర్‌ చట్టాలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేస్తామని, కులగణన చేపడతామని, రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అప్రెంటీస్‌షిప్‌ హక్కు, ఉద్యోగాలలో మహిళలకు 50 రిజర్వేషన్‌ కల్పిస్తామని పేర్కొంది. జమ్ముకాశ్మీర్‌కి పూర్తి రాష్ట్ర హోదాకు మద్దతు ఇస్తామని, ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ని తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పెంచడానికి రాజ్యాంగ సవరణను చేస్తామని, ప్రభుత్వ రంగాలలో కాంట్రాక్ట్‌ కార్మికులను నిషేధిస్తామని, కార్మికుల ప్రయోజనాలను చట్టబద్ధంగా పరిరక్షిస్తామని పేర్కొంది.

పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ), జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సి), యుఎపిఎ చట్టాలను సమీక్షించి మార్పులను ప్రతిపాదిస్తామని పేర్కొంది. ఇతరచట్టాలు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమైనవని తెలిపింది. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు అధికారం కల్పించడం, విద్యుత్‌ పంపిణీని సమీక్షించడం, రాజ్యాంగ సవరణలను అమలు చేస్తామని తెలిపింది.

➡️