NEET-PG : నీట్‌ పిజి పరీక్ష వాయిదా

Jun 23,2024 09:38 #neet exam

ఎన్‌టిఎ డైరెక్టర్‌పై వేటు
సుభోద్‌ స్థానంలో ప్రదీప్‌ సింగ్‌ నియామకం

న్యూఢిల్లీ : వివాదాల నేపధ్యంలో నీట్‌ పిజి పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూ ల్‌ ప్రకారం ఈ పరీక్ష ఆదివారం (జూన్‌ 23) జరగాల్సి ఉంది. పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత వెల్లడిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నీట్‌, నెట్‌ ప్రశ్నా పత్రాల కుంభకోణంలో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వం తన పరువు కాపాడుకోవడానికి అడ్మినిస్ట్రేషన్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) డైరక్టర్‌ జనరల్‌ (డిజి) పై వేటు వేసింది. ఆయన స్థానంలో రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాను నియమించింది. ప్రదీప్‌ ప్రస్తుతం భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటిపిఒ) ఛైర్మన్‌గాను, మేనేజింగ్‌ ఎడిటర్‌గానూ ఉన్నారు. ఎన్‌టిఎ డైరెక్టర్‌ జనరల్‌గా ఆయన అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ‘రెగ్యులర్‌ నియామకాలు చేపట్టే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు..’ ప్రదీప్‌ ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర వ్యక్తిగత మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సుబోధ్‌ కుమార్‌ ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగాఉన్న సమయంలో కేంద్రం ఆయనను తీసుకొచ్చి ఎన్‌టిఎ డిజిగా నియమించింది. నీట్‌ స్కామ్‌, నెట్‌ లీకేజి వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోసం ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు పట్టుబడుతుండడంతో సుబోద్‌ కుమార్‌ను బలిపశువును చేసింది.

➡️