జెసిబిలతో నేలమట్టం

  • పంజాబ్‌ సరిహద్దుల్లో రైతు శిబిరాలపై పోలీసుల దాష్టీకం
  • పోలీసుల అదుపులో వందమంది రైతులు, నేతలు
  • రెస్ట్‌హౌస్‌కు దల్లేవాల్‌ తరలింపు

అమృతసర్‌ : రైతులను నిర్బంధించడానికి, వారిపై పోలీసులు అణచివేత చర్యలకు పాల్పడడానికి నిరసనగా పంజాబ్‌వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. వందమందికి పైగా రైతులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రైతు సంఘాలు తెలిపాయి. శంభు, ఖానౌరి ఏరియాల్లో ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్న రైతులను పంజాబ్‌ పోలీసులు బలవంతంగా తరలించి, నిరసన ప్రాంతాల్లో రోడ్లను క్లియర్‌ చేస్తున్నారు. సరిహద్దులను తిరిగి తెరవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పంజాబ్‌ మంత్రి హర్పాల్‌ సింగ్‌ చీమా సమర్ధించుకున్నారు. కాంగ్రెస్‌, అకాలీదళ్‌ నేతలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించాయి. కేంద్ర ప్రభుత్వంతో రైతు నేతల తదుపరి దఫా చర్చలు మే 4న జరగనున్నాయి.

పోలీసుల అరాచకం, అణచివేత

తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలు, వేదికలను తొలగించిన వెంటనే రెండు హైవేలపైనా రాకపోకలకు మార్గం సుగమం చేస్తామని పోలీసులు చెప్పారు. రైతులు పెట్టుకున్న ట్రాలీలను, ఇతర వాహనాలను అక్కడ నుండి తీసివేస్తున్నారు. పోలీసుల అణచివేత చర్యలతో శంభు సరిహద్దు ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. బుధవారం వరకు ఈ తాత్కాలిక నిర్మాణాలు, ట్రాలీలే రైతులకు ఆశ్రయం కల్పించాయి. గురువారం నాటికి ఒక్కసారిగా అవన్నీ నేలమట్టమయ్యాయి. ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు వీలుగా జెసిబి యంత్రాలతో వాటన్నింటినీ శిధిలాల గుట్టగా మార్చేశారు. వంటకు ఉపయోగించే పాత్రలు, గ్యాస్‌ సిలిండర్లు, టీ కెటిళ్ళు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్లు, కుర్చీలు, టేబుళ్ళు, పరుపులు, బట్టలు ఇలా గతేడాది ఫిబ్రవరి నుండి రైతులు ఉపయోగించిన ప్రతీ వస్తువూ రోడ్లపై చెల్లాచెదురుగా పడి వున్నాయి. తమకు ముందుగా ఎలాంటి సమాచారం అందించలేదని, అకస్మాత్తుగా పోలీసులు వచ్చి విధ్వంసానికి దిగారని రైతు నేత ఒకరు చెప్పారు. పోలీసులు ఈ చర్యలకు దిగడానికి ముందుగా భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. అందులో అంబులెన్సులు, బస్సులు, అగ్నిమాపక యంత్రాలు, అల్లర్ల నిరోధక బృందాలు వున్నాయి. దాదాపు మూడు వేల మంది పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అక్కడ నుండి ఖాళీ చేయడానికి రైతులకు కేవలం పది నిముషాలు సమయమిచ్చారు. లేనిపక్షంలో వారిని అదుపులోకి తీసుకుని బస్సుల్లో తరలిస్తామని హెచ్చరించారు.

రెస్ట్‌హౌస్‌కు దల్లేవాల్‌ తరలింపు

కేంద్ర ప్రతినిధి బృందంతో బుధవారం సమావేశానంతరం తిరిగి వస్తుండగా సర్వాన్‌ సింగ్‌ పాంథర్‌, జగ్‌జిత్‌ సింగ్‌ దల్లెవాల్‌తో సహా పలువురు రైతు నాయకులను మొహాలీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దల్లెవాల్‌ను గురువారం జలంథర్‌ కంటోన్మెంట్‌లోని పిడబ్ల్యుడి రెస్ట్‌ హౌస్‌కు తరలించారు. అక్కడ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. గతేడాది నవంబరు 26 నుండి నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తోంది. తెల్లవారు జామున 1.35 గంటల సమయంలో పంజాబ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు ఆయనను తీసుకువచ్చారు. అనంతరం రెస్ట్‌ హౌస్‌కు తరలించారు. బారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. దల్లెవాల్‌ను కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు.

ధర్నాలకు పిలుపు

పోలీసుల అణచివేత చర్యలను కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ (కెఎంఎస్‌సి) నాయకుడు సత్నాం సింగ్‌ పన్నూ తీవ్రంగా ఖండించారు. కేంద్రంతో కుమ్మక్కైన పంజాబ్‌ ప్రభుత్వం రైతులపై అణచివేతకు పాల్పడుతోందని విమర్శించారు. వెంటనే సంయుక్త కిసాన్‌ మోర్చా (రాజకీయేతర), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చాల నేతృత్వంలో రైతులు ధర్నాలకు పిలుపునిచ్చారు. పంజాబ్‌, ఇతర రాష్ట్రాల్లోని డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయాల వెలుపల ధర్నాలు చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. హర్యానా ముఖ్యమంత్రి నయీబ్‌ సింగ్‌ సైని కర్నాల్‌ నివాసం వెలుపల రైతులు ధర్నా చేశారు. ఫిరోజ్‌పూర్‌లో డిసి కార్యాలయం వెలుపల కూడా రైతులు నిరసనలు చేపట్టారు. రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం మాత్రమే పరిష్కరించగలదని ఆప్‌ నేత సందీప్‌ పాథక్‌ వ్యాఖ్యానించారు.

పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్‌ నిరసన

పోలీసుల అణచివేత చర్యలపై పార్లమెంట్‌ ఆవరణలో పంజాబ్‌ కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన తెలిపారు. వారిని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కలిసి మాట్లాడారు. రైతు వ్యతిరేక పార్టీలు రెండూ చేతులు కలిపాయని పేర్కొంటూ కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తొలుత పంజాబ్‌ ప్రభుత్వం చర్చల కోసం రైతులను పిలిచి తర్వాత వారిని నిరసన శిబిరాల నుండి బలవంతంగా వెళ్ళగొట్టిందని విమర్శించారు. రైతులపై దాడులకు దిగారంటూ బిజెపి, ఆప్‌ ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వెన్నుపోటు చర్యలకు పంజాబ్‌ ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని కాంగ్రెస్‌ నేత సుప్రియ శ్రినెట్‌ హెచ్చరించారు.

పంజాబ్‌, హర్యానాల మధ్య శంభు (శంభు-అంబాలా), ఖానౌరి (సంగ్రూర్‌-జింద్‌) సరిహద్దు పాయింట్లు వద్ద రైతులు గత ఏడాది శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఢిల్లీకి వారు చేపట్టిన ప్రదర్శనను భద్రతా బలగాలు భగం చేయడంతో గతేడాది ఫిబ్రవరి 13న ఈ నిరసన ప్రారంభమైంది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీని కల్పించడంతో సహా పలు డిమాండ్లు నెరవేర్చాలని రైతులు కోరుతున్నారు.

➡️