NIA : ఖలిస్తానీ ఉగ్రవాది లాండా కీలక సహాయకుడు బల్జీత్‌సింగ్‌ను అరెస్టు చేసిన ఎన్‌ఐఎ

న్యూఢిల్లీ : మారణాయుధాల సరఫరాకు సంబంధించిన ప్రధాన ఉగ్రవాద నెట్‌వర్క్‌ కేసులో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్‌ సింగ్‌ అలియాస్‌ లాండా కీలక సహాయకుడైన బల్జీత్‌సింగ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గురువారం అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్‌ఐఎ ఏజెన్సీ శుక్రవారం తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని బద్వానీ జిల్లాకు చెందిన బల్జీత్‌సింగ్‌ అలియాస్‌ రాణా భారు అలియాస్‌ బల్లిగా పిలిచే ఇతన్ని పంజాబ్‌లో గురువారం ఎన్‌ఐఎ అధికారులు అరెస్టు చేశారు. పంజాబ్‌లోని లాండా ఏంజెట్లకు ప్రధాన ఆయుధాల సరఫరాదారునిగాబల్జిత్‌సింగ్‌ని ఎన్‌ఐఎ అధికారులు గుర్తించారు. ఇతను సరఫరా చేసిన ఆయుధాలు వ్యాపారవేత్తలపై జరిగే దోపిడీలతో సహా పెద్దఎత్తున ఉగ్రవాద కార్యాకలాపాలను నిర్వహించడానికి ఉపయోగించినట్లు ఎన్‌ఐఎ పేర్కొంది.
కాగా, ఈ కేసులో లాండా సహచరుడైన గుర్‌ప్రీత్‌సింగ్‌ గోపి, మరో వ్యక్తి సత్నామ్‌ సింగ్‌ సత్తాను ఎన్‌ఐఎ అధికారులు అరెస్టు చేశారు. పంజాబ్‌ తదితర ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థల కుట్రల భాగంగానే బల్జీత్‌సింగ్‌ సత్తాకు కూడా ఆయుధాలు అందించినట్లు ఈ కేసు దర్యాప్తులో వెల్లడైందని ఎన్‌ఐఎ తెలిపింది. ఈ కేసును గతేడాది జులై 10న సుమోటోగా కేసు నమోదు చేయడం జరిగింది.

➡️