ఫిరోజ్‌పూర్ : ఒక ట్రక్కు – వ్యాన్ ఢీ కొనడంతో తొమ్మిదిమంది మరణించగా, మరో తొమ్మిది మంది గాయపడిన ఘటన పంజాబ్‌లో శుక్రవారం జరిగింది. ఫిరోజ్‌పూర్ జిల్లా గురుహర్సహై సబ్ డివిజన్‌లోని ఒక గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో దట్టంగా అలముకున్న పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడైందని జిల్లా సీనియర్ ఎస్‌పి సౌమ్య మిశ్రా తెలిపారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. గాయపడిన తొమ్మిది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రమాదం సమయంలో వ్యాన్‌లో 20 మందికి పైగా ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది వెయిటర్లుగా పనిచేస్తున్నారని చెప్పారు. జలాలాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
